Court’s relief to Sonu Nigam over controversial remarks | బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌కు కర్ణాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక మ్యూజికల్ ఈవెంట్లో కన్నడ ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్న కేసుకు సంబంధించి నేడు హైకోర్టులో విచారణకు జరుగగా… ఈ కేసులో సోనూ నిగమ్‌కి హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు సోను నిగమ్‌ను అరెస్టు చేయవద్దని అలాగే అతడిపై ఇతర బలవంతపు చర్యలు చేపట్టవద్దని జస్టిస్ శివశంకర్ అమరన్నవర్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం అతడిపై ఉన్న కేసుకి సంబంధించి పోలీసు దర్యాప్తునకు ఆయన సహకరించాలని షరతు విధించింది.
అలాగే వాంగ్మూలం నమోదు చేయడానికి సోను నిగమ్ వ్యక్తిగతంగా కర్ణాటకకు రావాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. పోలీసులు ఆయన వాంగ్మూలం తీసుకోవాలనుకుంటే, వారి ఖర్చులతో ఆయన నివాసానికి వెళ్లి తీసుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా, తదుపరి విచారణ వరకు తుది పోలీసు నివేదిక దాఖలు చేయడాన్ని కూడా హైకోర్టు నిలిపివేసింది.
కాగా, ఏప్రిల్ 25న బెంగళూరులో జరిగిన ఒక మ్యూజికల్ ఈవెంట్లో కన్నడ పాటలు పాడమని కొందరు ప్రేక్షకులు కోరగా, సోను నిగమ్ అసహనం వ్యక్తం చేస్తూ దానిని పహల్గామ్ ఉగ్రదాడితో పోల్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కర్ణాటక రక్షణ వేదిక ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సోను నిగమ్‌పై నేరపూరిత బెదిరింపు, శాంతి భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానించడం వంటి పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే, తన వ్యాఖ్యలు కొందరు అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తులను ఉద్దేశించి మాత్రమేనని, కన్నడ సమాజం మొత్తాన్ని కాదని సోను నిగమ్ వివరణ ఇచ్చారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆయనకు తాత్కాలిక ఊరట కల్పించింది. ఈ కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది.