‘ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మన చట్టాల్లోని సెక్షన్లను మరచిపోకుండా గుర్తుపెట్టుకున్నా. ప్రతి సీన్ రియలిస్టిక్‌గా ఉండేలా చూసుకున్నాం’ అన్నారు ప్రియదర్శి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నో బడీ’. రామ్‌జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హీరో నాని సమర్పకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రియదర్శి పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
దాదాపు మూడేళ్ల క్రితం దర్శకుడు రామ్ జగదీష్ ఈ స్టోరీ ఐడియా చెప్పాడు. బాగుందనిపించింది. ఆరు నెలల తర్వాత కథ మొత్తం రాసుకొచ్చాడు. ఇలాంటి కథల్ని తప్పకుండా ప్రేక్షకులకు చెప్పాలనిపించింది. గోవాలో ‘హాయ్ నాన్న’ షూటింగ్ టైమ్‌లో నానికి ఈ కథ గురించి చెప్పా. ఆయనకు బాగా నచ్చి ‘ఈ సినిమా మనం చేస్తున్నాం’ అన్నారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది
పోక్సో కేసు నేపథ్యంలో నడిచే కోర్ట్ రూమ్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా హార్డ్‌వర్క్ చేశాడు. కొంతమంది లాయర్లను కలిసి పొక్సో చట్టం గురించి, దానికి విధించే శిక్షల గురించి తెలుసుకున్నాడు. ఈ తరహా కేసుల్లో వెలువడిన తీర్పుల ద్వారా ఒక మెటీరియల్‌ను తయారు చేశాడు. వాటిని నాకు కూడా ఇచ్చాడు.
ఈ క్యారెక్టర్ కోసం మన కోర్టుల్లో లాయర్లు, జడ్జీలు వాడే భాష, వారి వస్త్రధారణ.. ఇలా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాను. నిజమైన లాయర్‌గా కనిపించే ప్రయత్నం చేశా. సెక్షన్లను కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నా. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు లాయర్ల మీద గౌరవం పెరిగింది. అంబేద్కర్‌గారు రాసిన రాజ్యాంగం మనకు ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమైంది. ఈ సినిమాను బార్ కౌన్సిల్ వారికి కూడా చూపిద్దామనుకుంటున్నాం.
ఈ సినిమా చూశాక నాని..‘నేను ఏదో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది’ అంటూ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఓ నటుడిగా ఇలాంటి కథల్ని ప్రేక్షకులకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందనుకుంటున్నా. శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు కేఐ వరప్రసాద్‌గారి బయోపిక్‌లో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది నా డ్రీమ్ రోల్. నా తదుపరి చిత్రం ‘సారంగపాణి జాతకం’ ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది. గీతా ఆర్ట్స్‌లో కూడా ఓ సినిమా సైన్ చేశాను.