Squid Game S2 | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ తన సినిమాను చూసి కాపీ కొట్టి తీశారని బాలీవుడ్ దర్శకుడు కేసు వేశాడు. పాపులర్ కొరియన్ డ్రామా ‘స్క్విడ్ గేమ్’ ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని సగం కంటే ఎక్కువ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ను చూశారు. 2021 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్టయింది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది.
అయితే ఈ సిరీస్‌ను తన సినిమా లక్ మూవీని కాపీ కొట్టి తీశారంటూ బాలీవుడ్ దర్శకుడు సోహమ్ షా ఆరోపించాడు. అంతేగాకుండా ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. అలాగే ఈ సిరీస్‌ను వెంటనే స్ట్రీమింగ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ తొలగించాలని కోరారు. అయితే ఈ ఆరోపణలపై నెట్‌ఫ్లిక్స్ తాజాగా స్పందించింది. ఆ డైరెక్ట్ చేసింది కేవలం ఆరోపణలు మాత్రమేనని, అందులో ఎటువంటి నిజాలు లేవంటూ పేర్కొంది. ఈ కథను రాసింది దర్శకత్వం వహించింది హ్వాంగ్ డాంగ్ హ్యుక్ మాత్రమేనంటూ ప్రకటన విడుదల చేసింది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, మిథున్ చక్రవర్తి, ఇమ్రాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం లక్. ఈ సినిమాతోనే శృతి హాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
మరోవైపు ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 1 ఇప్పటికే రికార్డు వ్యూస్ సాధించగా.. తాజాగా సీజన్ 2 రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి సీజన్ 2 ప్రసారం కానున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. అలాగే ఈ సిరీస్ ఫైనల్ సీజన్‌ను వచ్చే ఏడాది తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా ఓ వీడియో ద్వారా ప్రకటించింది.