Coolie | సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో ఉత్సాహం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల్లోనూ ఆయనకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా, తొలిరోజే థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టించడం రజనీకి మాత్రమే చెల్లుతుంది. 2024లో ‘వెట్టయాన్’తో అలరించిన రజినీకాంత్, ఇప్పుడు యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి చేసిన ‘కూలీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది . ఆగస్టు 14న వేలాది థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్ పిక్చర్స్ సిద్ధమవుతోంది.
అయితే అదే రోజున ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ కూడా విడుదలవుతోంది. ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదల కావడం, బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా పైచేయి అవుతుందో అనే ఉత్కంఠను పెంచుతోంది. సాధారణంగా సినిమా విడుదలకు ముందు ట్రైలర్ విడుదల చేయడం ప్రమోషన్స్‌లో భాగం అనే విషయం తెలిసిందే. అయితే ‘కూలీ’కు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్రైలర్ విడుదల చేయకుండా, డైరెక్ట్‌గా సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ స్టేట్మెంట్ అభిమానులకి కొంత నిరాశ కలిగించింది. అయితే తాజాగా మేకర్స్ నిర్ణయం మార్చుకుని, ఆగస్టు 2న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం రాత్రి సన్ పిక్చర్స్ ట్వీట్ చేయడంతో రజినీ అభిమానుల్లో ఆనందం ఊపందుకుంది.
ఈ సినిమా ఎల్సీయూ (Lokesh Cinematic Universe) లో భాగంగా వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన ‘మోనికా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటలో పూజా హెగ్డే కన్నా ఎక్కువగా మలయాళ నటుడు సాబిన్ షాహిర్ డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది.ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రూ.44 కోట్లకు దగ్గుబాటి సురేష్‌బాబు, సునీల్ నారంగ్ కలిసి కొనుగోలు చేశారు. ఇది భారీ డీల్‌గా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.‘కూలీ’ సినిమాలో అక్కినేని నాగార్జున, సత్యరాజ్, శ్రుతి హాసన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఒక స్పెషల్ క్యామియో రోల్ చేస్తుండటం మూవీపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. రజినీకాంత్ vs ఎన్టీఆర్-హృతిక్ రోషన్.. ఆగస్టు 14న థియేటర్లలో అసలైన పోటీకి దిగబోతున్నారు. ఎవరు గెలుస్తారో చూడాలి.