Coolie | ఈ ఏడాది భారీ హైప్‌తో విడుదల కాబోతున్న సినిమాల్లో కూలి ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను ఆగస్ట్ 14న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించగా, పూజా హెగ్డే మోనికా అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసారు. ఆ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
మొత్తం 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ సినిమాలో ఎక్కువ భాగం స్టార్ కాస్ట్ పారితోషికాలకే ఖర్చైనట్లు సమాచారం. రజినీకాంత్ ఒక్కరే రూ.150 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నాగార్జున విలన్ పాత్రకు రూ.10 కోట్లు, అమీర్ ఖాన్ 20 నిమిషాల గెస్ట్ రోల్‌కి రూ.20 కోట్లు, పూజా హెగ్డే ఒక్క పాటకు రూ.3 కోట్లు అందుకున్నారు. అలాగే ఉపేంద్ర, శృతి హాసన్ తలో రూ.4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. తలైవా అభిమానులు ఇప్పటికే తమిళనాడులో సంబరాలు మొదలుపెట్టారు. కూలీ సక్సెస్ కోసం ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్లలోనే 8,35,850 టిక్కెట్లు అమ్ముడవ్వడంతో ఈ సినిమాపై ఎంతటి క్రేజ్ ఉందో తెలుస్తోంది.
మరోవైపు, అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘కూలీ’ దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-సేల్స్‌లో రూ. 14 కోట్లు వసూలు చేయగా, ఇదే సమయంలో విడుదలవుతున్న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘వార్ 2’ కేవలం రూ. 2.08 కోట్లు మాత్రమే రాబట్టిందని అంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 6 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయని, బ్లాక్ సీట్లతో కలిపితే ఈ మొత్తం రూ. 20 కోట్లకు చేరువలో ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కొడుతుందని అంటున్నారు.