Coolie | సినీ ప్రేమికులు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ చిత్రం ‘కూలీ’ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 14న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అదే రోజు హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన ‘వార్ 2’ కూడా విడుదల కానుండటంతో, బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనబోతోంది. అయితే కూలీ చిత్రంలో స్టార్ నటీనటులు నటిస్తుండడంతో మూవీపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘కూలీ’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి.
ఇప్పటికే కేరళ ,కర్ణాటక రాష్ట్రాల్లోని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఆగస్టు 14 ఉదయం 6 గంటలకు ఫస్ట్ షో వేయనున్నారు. తమిళనాడులో మాత్రం గతంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో తెల్లవారుజాము షోలు నిషేధించబడ్డాయి . దీంతో అక్కడ ఫస్ట్ షో ఉదయం 9 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుంది. సెన్సార్ బోర్డు ‘కూలీ’కి A’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. దీనివల్ల తమిళనాడు లో అనేక థియేటర్లు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన ప్రేక్షకులను చిత్ర ప్రదర్శనకు అనుమతించకూడదని స్పష్టంగా ప్రకటించాయి.
UK లో ‘కూలీ’కి ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ ఫస్ట్ షో భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు (స్థానిక సమయం 12:30 AM) ప్రదర్శించనున్నారు. దుబాయ్ లో ఉదయం 9:30 గంటలకు మొదటి షోలు మొదలవుతాయి. అక్కడ త్వరలో మరిన్ని షోలు జోడించే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ‘కూలీ’ ప్రీ-సేల్స్ ద్వారా $2 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ఉత్తర అమెరికా నుంచే $1.3 మిలియన్లు సాధించింది. అక్కడ ఇప్పటికే 50,000 టికెట్లు అమ్ముడవడం విశేషం.
ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సాబిన్ షాహిర్ లాంటి స్టార్ నటులు నటించారు. దీంతో సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. కూలీ చిత్రం కోలీవుడ్ చరిత్రలో 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందా అన్నదానికి సమాధానం రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.