Comedian Shiva Rao | ఇది 1930ల్లో నాటి ముచ్చట. తెలుగుతెరపై తొలి స్టార్ కమెడియన్ కస్తూరి శివరావ్ నిజజీవితంలో జరిగిన సంఘటన ఇది. ఆరోజుల్లో జనాలు ఎంత అమాయకంగా ఉండేవాళ్లో ఈ సన్నివేశం చదివితే అర్థమవుతుంది. ఇది యదార్థ సంఘటన. స్వర్గీయ రావికొండలరావుగారు తను స్వయంగా రాసిన హ్యూమరథంలో ఈ సంఘటన గురించి ప్రస్తావించారు కూడా. ఇక విషయంలోకెళ్తే.. శివరావ్ సినిమాల్లోకి రాకముందు ముంబాయ్‌లో టెంటు హాళ్ల దగ్గర కొన్నాళ్లు సినిమా టికెట్లు చింపేవారు. ఆ తర్వాత ప్రమోషన్‌తో అక్కడేవున్న మరో థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా ప్రమోటయ్యారు.
ఓ రోజు ఆ థియటర్లో ప్రదర్శించటానికి ఓ బెంగాలీ చిత్రాన్ని ఓనర్ కొనుకొచ్చాడు. అది కుటుంబకథాచిత్రమే అయినా, కథానుగుణంగా, సన్నివేశం డిమాండ్ మేరకు అందులోని నాయిక వెనక్కి తిరిగి తన రైకను విప్పదీస్తుంది. పబ్లిసిటీ పోస్టర్లలో కూడా వెనక్కి తిరిగి రైకను విప్పదీస్తున్న హీరోయిన్ స్టిల్‌నే వాడారు. పోస్టర్‌పై ఆమె వీపు భాగం కనిపిస్తూవుంటుందన్నమాట. దాంతో ఆ పోస్టర్లు చూసిన మగపురుగులంతా థియేటర్‌కి పోటెత్తారు. సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతున్నది. ఆ సన్నివేశం కోసం ఆశగా చూస్తూ, తీరా రాగానే అందులో ఏమీలేక ప్రేక్షకులు నిరుత్సాహానికి గురయ్యేవారు. ప్రేక్షకులు తంతు ఇలా ఉంటే, థియేటర్ యజమాని తంతు మరోలా ఉంది. ఆ సన్నివేశం మరికొన్ని క్షణాల్లో వస్తుందనగా.. వాయువేగంతో తెర వెనక్కు పరిగెత్తేవాడు ఆ థియేటర్ యజమాని.
తెర వెనుక నుంచి చూసినా అక్కడ కూడా హీరోయిన్ వెనక్కు తిరిగే కనిపిస్తుండటంతో తీవ్రమైన నిరాశకు లోనైపోయేవాడు. సినిమా ఆడుతున్నన్ని రోజులూ ఇదే తంతు. ఇక కొన్ని రోజులకు అతనిలో సహనం నశించింది. నేరుగా ప్రొజెక్టర్ రూమ్‌కి వెళ్లిపోయి శివరావ్తో గొడవ పెట్టేసుకున్నాడు. ‘నేను వెనక్కెళ్లడం చూసి, కావాలనే నువ్వు బొమ్మను తిప్పేస్తున్నావ్. ఏం ఆటలుగా ఉందా?.. డిస్మిస్..’ అనేశాడంట. పాపం శివరావ్ అర్థంకానట్టు తల గోక్కుంటూ.. ‘ఎట్నుంచి చూసినా అంతే కనిపిస్తదయ్యా సామీ..’ అంటూ నచ్చజెప్పబోయారంట. కానీ ఆ యజమాని వింటేనా?!.. పాపం చేసేది లేక శివరావ్ మరోదారి చూసుకున్నారంట. కాలక్రమంలో ఆయనే స్టార్ కమెడియన్‌గా అదే వెండితెరపై ఓ వెలుగు వెలిగారు.