కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ కేజీఎఫ్ 2 విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. థర్డ్ వేవ్ వల్ల విడుదల వాయిదాలు పడిన భారీ చిత్రాల్లో కేజీఎఫ్ రెండో భాగం కూడా ఉంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం గతేడాది డిసెంబర్ లోనే ఈ సినిమా తెరపైకి రావాలి. పుష్పకు పోటీగా కేజీఎఫ్ 2 అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు నిర్మాతలు. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భారీ చిత్రాలు తిరిగి విడుదల బాట పట్టాయి. వాటిలో కేజీఎఫ్ 2 (kgf chapter 2)రిలీజ్ డేట్ ఖరారు కోసం ఆసక్తి నెలకొంది.
తాజాగా కేజీఎఫ్ 2 విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు హోంబలే ఫిలింస్ (Hombale films) నిర్మాతలు. చిత్ర బృందం పలు దేవాలయాలను సందర్శించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా కేజీఎఫ్ 2 ఆన్ ఏప్రిల్ 14 అని ప్రకటించారు. దీంతో ఇప్పటిదాకా సినిమా విడుదల తేదీపై ఉన్న అనుమానాలు తేలిపోయాయి. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో మరో భారీ చిత్రం సమ్మర్ పోటీకి సిద్ధమైనట్లయింది.
ఇక ఈ చిత్రం నుంచి మరో తాజా అప్డేట్ బయటకొచ్చింది. కేజీఎఫ్ 2 లోనూ ఒక ప్రత్యేక గీతం ఉంటుందని ఈ పాటలో లైగర్ భామ అనన్య పాండే ఆడిపాడనుందని సమాచారం. కేజీఎఫ్ లో ప్రాంతీయ భాషల్లో తమన్నా (Tamannah), హిందీలో మౌనీ రాయ్ డాన్సులు చేసింది. ఈ పాట చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 లోనూ అలాంటి మాస్ సాంగ్ పెడుతున్నారు. లెజెండరీ ఫిలిం షోలే మెహబూబా మెహబూబా పాటను రీమిక్స్ చేస్తున్నారట. ఈ పాట చిత్రీకరణ కూడా హైలైట్ గా ఉంటుందని చెబుతుంది చిత్ర బృందం.