యావత్ సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ అనే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2021 అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చెబుతూ వచ్చారు. దీనికి తగ్గట్లుగానే ప్రతి పోస్టర్ లోనూ అదే తేదీని వేస్తూ సినీ అభిమానుల్లో ఆశ కల్పించారు. కాని ప్రస్తుత పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని వాయిదా వేయనున్నట్టు ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నట్టు ప్రకటించారు.
అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదల ఉంటే అఖిల్ వంటి కుర్ర హీరో ఆ సమయానికి తన సినిమాని తీసుకొచ్చే ఛాన్సే లేదు. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాదే విడుదల అవుతుందని పలువురు జోస్యాలు చెబుతున్నారు. మొత్తం భారతీయ థియేట్రికల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో పరిస్థితులు చక్కబడే అవకాశం ఉండటంతో తదుపరి మంచి సీజన్ కోసం ట్రిపుల్ ఆర్ మేకర్స్ చూస్తున్నారట. అతి త్వరలోనే ఆర్ఆర్ఆర్ రిలాజ్ డేట్‌కి సంబంధించి ప్రకటన రానుంది.