Mega 158 | మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. ఫ్యాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన పొందింది. ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.ఇంకా అదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఓ మంచి ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్ట్కూ కమిట్ అయ్యారు. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తర్వాత మళ్లీ బాబీ (బాలీ కొల్లి) దర్శకత్వంలో ‘మెగా 158’ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా దసరా తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది. మెగా ఫ్యాన్స్ ఈ హిట్ కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో విలన్‌గా మంచు మనోజ్ కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ‘మిరాయ్’ సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్న మనోజ్, చిరుతో స్క్రీన్ షేర్ చేస్తే ఓ డిఫరెంట్ ఎలివేషన్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో చిరుకు జోడీగా అనుష్క శెట్టిను తీసుకోవాలనుకుంటున్నాడట బాబీ. చిరంజీవితో అనుష్క ఇప్పటివరకు పూర్తి సినిమా చేయలేదు. ‘స్టాలిన్’ సినిమాలో ఒక పాటలో స్టెప్పులేసింది. ఇక ‘మెగా 158’లో పూర్తి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి వయసు 70కి చేరుకుంటున్నా, ఆయన ఎనర్జీ మాత్రం యువహీరోలకే సవాల్ విసిరేలా ఉంటుంది. కానీ, కూతురు లేదా మనవరాలి వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే విమర్శలు వస్తాయన్న భయం మేకర్స్‌లో కనిపిస్తోంది. అందుకే తాజాగా వస్తున్న సినిమాల్లో త్రిష, నయనతార, అనుష్కలాంటి సీనియర్ హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు. ఇటీవల ‘ఘాటి’ సినిమాతో పలకరించిన అనుష్కకి ఇది మరో గోల్డెన్ ఛాన్స్ కావచ్చు. చిరంజీవితో ఈ సినిమా వస్తే, ఆమె మళ్లీ ఫామ్‌లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే లుక్‌పై విమర్శలు ఎదుర్కొన్న అనుష్క, ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే బరువు తగ్గాల్సిందేనని కండీషన్ పెట్టారని ఇండస్ట్రీ టాక్.