అగ్ర కథానాయకుడు చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని చిరంజీవి పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఇందులో మెగాస్టార్ పవర్ఫుల్, స్ట్రైకింగ్ లుక్‌లో కనిపిస్తారని లుక్ టెస్ట్‌ని బట్టి అర్థమవుతున్నది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ రెండో చిత్రం మెగా అభిమానులకు విందు భోజనంలా ఉంటుందని సమాచారం. మాస్ ఎంటర్టైనర్స్ తీయడంలో సిద్ధహస్తుడైన బాబీ ఈసారి మెగాస్టార్ కోసం ఇంటెన్స్ క్యారెక్టర్ని డిజైన్ చేశారని, మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ మరింత ఎలివేట్ అయ్యేలా స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారని, పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటిస్తారు.