Chiranjeevi | సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో చిరంజీవి ‘విశ్వంభర’ ఒకటి. రొటీన్‌కి భిన్నంగా ఈ సారి సోషియో ఫాంటసీ కథతో మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిక్షన్ కథల్లో ఇదొక వినూత్న ప్రయత్నం అని తెలుస్తున్నది. ‘విశ్వంభర’ అంటే ఓ లోకం. ఆ లోకానికీ.. భూలోకానికీ సంబంధం ఏంటి? అసలు ఈ కథలో చిరంజీవి ఎవరు? వేరే లోకానికెళ్లి ఆయన సాధించేదేంటి? తదితర అంశాలన్నీ కొత్తగా ఉంటాయట. అబ్బురపరిచే చందమామ కథలా ఈ సినిమా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ సినిమాలోని పాత్రకు నెక్ట్స్ లెవల్‌గా ఇందులో చిరంజీవి పాత్ర ఉంటుందట. ఇందులో ఆయన కారణజన్ముడిగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర చిరంజీవి పాత్రకు ధీటుగా ఉంటుందట. ఇందులో బలమైన కథానాయికగా త్రిష కనిపిస్తారని సమాచారం. త్వరలోనే టీజర్‌ని విడుదల చేయనున్నారు. మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి, నిర్మాణం: యూవీ క్రియేషన్స్.