Chiranjeevi | ప్రపంచం రోజురోజుకీ సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే టెక్నాలజీ ప్రపంచాన్ని కొత్త దిశలోకి నడిపిస్తోంది. అయితే ఈ ఆధునిక సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తూ, డీప్‌ఫేక్ (Deepfake) వీడియోల రూపంలో అశ్లీలత, తప్పుడు ప్రచారానికి వేదికగా మలుస్తున్నారు. ఇప్పుడు ఈ డీప్‌ఫేక్ బారిన సినీ మెగాస్టార్ చిరంజీవి కూడా పడటం కలకలం రేపుతోంది.తాజాగా దుండగులు మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా రూపొందించి, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు వెబ్సైట్లలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యాయి.
ఈ విషయం తెలిసిన చిరంజీవి వెంటనే హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును కూడా ఆశ్రయించగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి — “డీప్‌ఫేక్ లాంటి టెక్నాలజీలను ఉపయోగించి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం చాలా ఘోరమైన విషయం. నా పేరుతో అశ్లీల వీడియోలు సృష్టించి పంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ పోలీసులను కోరారు. ఇటీవల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, నటీనటులు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోల బారినపడుతున్నారు. ఈ సాంకేతిక దుర్వినియోగంపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AI టెక్నాలజీ ఉపయోగంపై కఠిన నియంత్రణలు అవసరమని సూచిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్స్ట్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చిరు నటించిన విశ్వంభర, మన శంకర వరప్రసాద్ గారు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఆయన లైన్ లో పెట్టిన మూవీస్‌లో చిరంజీవి- బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర)ప్రాజెక్ట్ ఒకటి. చిరు బర్త్ డే సందర్భంగా #ChiruBobby2, ‘మెగా 158’, ‘ABC – Again Bobby Chiru’ అనే వర్కింగ్ టైటిల్స్‌తో వీరి కాంబోలో ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అప్పటి నుంచే ఈ సినిమా పట్ల మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు . ‘వాల్తేరు వీరయ్య’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని అందరు విశ్వసిస్తున్నారు.