Chiranjeevi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందాన్ని అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై ఆయన చేసిన ప్రశంసలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో చరణ్ నటించలేదు.. పూర్తిగా ఆ పాత్రలో జీవించాడు” అని కొనియాడారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో చరణ్ ప్రదర్శించిన నటన తనను ఎంతగానో కదిలించిందన్నారు. స్క్రీన్‌పై కన్నీళ్లు పెట్టకుండా కేవలం కళ్లతోనే ప్రేక్షకుల హృదయాలను తాకి భావోద్వేగానికి గురిచేయడం గొప్ప నటుడి లక్షణం. పెద్ది పాత్రలో చరణ్ అదే చేసి చూపించాడు అని ప్రశంసించారు.
ఒక తండ్రిగా మాత్రమే కాకుండా, తోటి నటుడిగా కూడా చరణ్ ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని చిరంజీవి తెలిపారు. ఇండస్ట్రీలో కొందరు చరణ్ నటన తనను మించిపోయిందని అంటున్నారని, ఆ మాటను తాను ఆనందంగా అంగీకరిస్తున్నానని వెల్లడించారు. సినిమా కథాంశం గురించి మాట్లాడిన చిరంజీవి, ‘పెద్ది’ కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదని అన్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల కష్టాలు, వారి పోరాటాలు, క్రీడాకారుల జీవితాల్లో ఎదురయ్యే సమస్యలను హృదయానికి హత్తుకునేలా చూపించిన చిత్రమని పేర్కొన్నారు. ఒక గ్రామ సమస్యగా మొదలైన కథ చివరకు దేశవ్యాప్తంగా క్రీడాకారుల ప్రోత్సాహంపై ఆలోచింపజేసే స్థాయికి చేరడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనమని అభినందించారు.
1989 నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల్లో మంచి ఆలోచనను రేకెత్తిస్తుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థలో మార్కులు, ర్యాంకులకే ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు క్రీడలు, శారీరక శ్రమ ఎంత అవసరమో ఈ చిత్రం గుర్తు చేస్తుందని చెప్పారు. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన కృషిని కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెజ్లర్‌గా కనిపించేందుకు చరణ్ ఉదయం 5 గంటలకే లేచి వర్కౌట్స్ చేయడం, రోజంతా షూటింగ్లో పాల్గొన్న తర్వాత కూడా జిమ్‌ను మిస్ కాకపోవడం తన కళ్లారా చూశానన్నారు. దాదాపు 70 రోజుల పాటు కఠినమైన వెజిటేరియన్ డైట్ పాటిస్తూ పాత్ర కోసం పూర్తిగా తనను తాను మార్చుకున్నాడని వెల్లడించారు.
చరణ్ షూటింగ్ సమయంలో గాయాలతో ఇంటికి వచ్చిన సందర్భాలు గుర్తు చేసుకున్న చిరంజీవి, గతంలో తాను రిస్కీ షాట్లు చేసినప్పుడు తన తండ్రి అనుభవించిన ఆందోళన అప్పుడే తనకు అర్థమైందని భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా సినిమాలోని హాస్పిటల్ సన్నివేశాలు ఇప్పటికీ తనకు గూస్బంప్స్ తెప్పిస్తాయని చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు సానాపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి, ఇలాంటి బలమైన కథలను చెప్పే దర్శకుడిగా ఆయన ఎదగడానికి ప్రేరణగా నిలిచిన దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.