Chiranjeevi | మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్. చిరంజీవి నటిస్తున్న తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. ఇటీవల ఆయన నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మెగాస్టార్, ఇప్పుడు తన కెరీర్లో 158వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన సినిమాకు డైరెక్టర్‌గా బాబీ కొల్లి వ్యవహరించనున్నారు.ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ నెలలోనే అధికారిక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి షెడ్యూల్లో భాగంగా చిరంజీవి పై సోలో ఎంట్రీ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత వెంటనే ఓ మాస్ సాంగ్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో చిరంజీవిని పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారని టాక్. అయితే కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ప్రధానంగా ఉండనున్నాయి. కథ కూడా ప్రత్యేకంగా ఉండేలా డైరెక్టర్ బాబీ కొల్లి ప్లాన్ చేశారని సమాచారం. చిరును కొత్తగా ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కథను సిద్ధం చేశారట. ఈ భారీ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది. ఆ విజయంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.మాస్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ మేళవింపుగా రాబోతున్న ఈ చిత్రం, మెగాస్టార్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.