Chiranjeevi | మంగపతి..ఈ పేరు వింటే అందరికి నాని నిర్మాణంలో రూపొందిన కోర్ట్ సినిమా గుర్తొస్తుంది. చిన్న సినిమాగా మొదలై పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. హోలీ పండగ సందర్భంగా విడుదలైన ఈ కోర్ట్ రూమ్ డ్రామా.. ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరు ఆశ్చర్యపోయేలా చేసింది. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించగా, హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. యాక్టర్ శివాజీ మంగపతి అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో నటించాడు. నటించాడు అనడం కన్నా కూడా జీవించాడు అనాలి. ఇన్నాళ్లు వైవిధ్యమైన పాత్రలలో నటించిన శివాజి కోర్ట్ మూవీలో మంగపతిగా అదరగొట్టాడు.
అతని నటనకి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా శివాజీ నటనకు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు దక్కాయి. ‘కోర్ట్’ సినిమా చూసిన చిరంజీవి.. శివాజీని తన నివాసానికి పిలిపించుకుని ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మంగపతిగా అద్భుతమైన నటన కనబరిచావు అని శివాజీని ప్రశంసించినట్టు తెలుస్తుంది. ఇక చిరంజీవిని చాలా రోజుల తర్వాత కలిసిన శివాజి ఆయనతో కలిసి తెగ సెల్ఫీలు దిగేశారు. అందుకు సంబంధించిన ఫొటోలని శివాజి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… ఈ క్షణం నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. నా ప్రియమైన అన్నయ్య చిరంజీవి మా ‘కోర్ట్’ సినిమా చూసి ఈ మంగపతిని, మొత్తం చిత్ర బృందానికి అభినందనలు తెలియజేయడం సంతోషంగా ఉంది.. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. లవ్ యూ అన్నయ్య అంటూ శివాజి తన ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ పెట్టారు.
ఇక 1997లో చిరంజీవి హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమాతో శివాజీ నటుడిగా పరిచయం కావడం విశేషం. చిత్రంలో చిరు దగ్గర చదువుకునే స్టూడెంట్ పాత్రలో నటించి మెప్పించాడు శివాజి. ఈ సినిమా తర్వాత శివాజి ఇంద్ర సినిమాలో మెగాస్టార్‌తో కలిసి నటించారు. చిరుని మోసం చేసే పాత్రలో ఆయన అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక చిరంజీవి మంచి సినిమాలను, బాగా నటించిన వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శివాజీని మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి పిలిచి అభినందించారు.ఇదిలా ఉంటే ‘కోర్ట్’ సినిమాని సమర్పించిన నాని.. చిరు – శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరక్కనున్న పాన్ ఇండియా మూవీని నిర్మించనున్నారు.