Chiranjeevi and Rajinikanth | మెగాస్టార్ చిరంజీవి, సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి మిత్రులు. కెరీర్‌ను పోటాపోటీగా నిర్మించుకున్న వారు. ఒకరు తెలుగులో మరొకరు తమిళంలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన వారే. ఏ అండా లేకుండా ఇండస్ట్రీకి రావడం నుంచి స్టార్స్‌గా ఎదిగేవరకు ఈ ఇద్దరిలో అనేక సారూప్యతలు కనిపిస్తాయి. ఇప్పుడు వాళ్లు అనుసరిస్తున్న పద్ధతి కూడా ఆ సిమిలారిటీస్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

ఇటు మెగాస్టార్, అటు సౌత్ సూపర్ స్టార్ ఇద్దరూ కొత్త దర్శకులను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవితో గానీ, రజనీకాంత్‌తో గానీ సినిమా చేయాలంటే ఆ దర్శకుడికి ఎంతో పేరు, అనుభవం, సక్సెస్ లు ఉంటే గానీ సాధ్యమయ్యేది కాదు. కానీ కొత్తతరం దర్శకులు వినూత్న ఆలోచనలతో సినిమాలను తెరకెక్కిస్తున్న విధానం ఈ అగ్ర హీరోలను ఆకర్షిస్తోంది. చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు మెహర్ రమేశ్‌తో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటే దర్శకుడు మోహన్ రాజాతో మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గాడ్‌ఫాదర్ అనే పేరు పెట్టారు. దర్శకుడు బాబీతో కోస్తా ఏరియా నేపథ్యంతో చిరంజీవి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వాల్తేర్ మొనగాడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఛలో, భీష్మ లాంటి విజయాలు అందుకున్న యువ దర్శకుడు వెంకీ కుడుములతో చిరు చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా మెగాస్టార్ యువ దర్శకులకు అవకాశాలిస్తున్నారు.

గత కొన్నేండ్లుగా రజనీకాంత్ కూడా యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తున్నాడు. పా రంజిత్‌తో కబాలి, కాలా చిత్రాల్లో నటించిన రజనీ..కార్తీక్ సుబ్బరాజ్‌తో పేట సినిమా చేశాడు. వరుణ్ డాక్టర్‌తో హిట్ కొట్టిన తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఇటీవలే ఓ సినిమాను ప్రకటించాడు. ప్రస్తుతం తలపతి విజయ్‌తో తెరకెక్కుతున్న బీస్ట్ సినిమాతో నెల్సన్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే రజనీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇంతలో అరుణ్ రాజా కామరాజ్ అనే మరో న్యూ టాలెంట్‌కు రజనీ సినిమా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు 170వ సినిమా కావడం విశేషం.