హైదరాబాద్: ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు మృతిపట్ల సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గౌతమ్ రాజు గారి లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన ఎంత సౌమ్యుడో ఎడిటింగ్ అంత వాడిగా ఉంటుందని గుర్తుచేసుకున్నారు. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్ మెళకువలు అపరిమితమని, ఎంత నెమ్మదస్తుడో ఆయన ఎడిటింగ్ అంత వేగమని తెలిపారు. తన చట్టానికి కళ్లు లేవు సినిమా నుంచి ఖైదీ నంబర్ 150 వరకు ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్ రాజు లేకపోవడం వ్యక్తిగతంగా నాకు, మొత్తం పరిశ్రమకు పెద్ద లోటని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.
Rest In Peace Gowtham Raju garu! pic.twitter.com/kmkii0wM8K
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2022
గౌతమ్‌రాజు మృతిపట్ల హీరో బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం చాలా బాధాకరమని చెప్పారు. ఆయన అద్భుతమైన ప్రతిభగల ఎడిటర్, తనకు ఎంతో ఆత్మీయులని, మృధుస్వభావి అని తెలిపారు. అనేక విజయవంతమైన సినిమాలకు కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు. తెలుగు సినీపరిశ్రమలో గౌతమ్‌రాజు చెరగని ముద్రవేశారని చెప్పారు. ఆయన మన మధ్యలేకపోవడం ఎందో దురదృష్టకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.