Soubin Shahir | మలయాళం నటుడు కూలీ సినిమా ఫేం షౌబిన్ షాహిర్పై ఎర్నాకులంలో చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా విషయంలో ఈ కేసు నమోదు అయ్యింది. మంజుమ్మల్ బాయ్స్ సినిమాకు షౌబిన్ షాహిర్తో పాటు అతడి తండ్రి, మరొకరు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాకి సిరాజ్ అనే వ్యక్తి రూ. 7 కోట్ల వరకు పెట్టుబడిని పెట్టాడు. సినిమా విడుదలయ్యకా లాభాల్లో 40 శాతం వాటా ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారని సిరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ, తనకు ఇంకా వాటా ఇవ్వలేదని.. షౌబిన్ షాహిర్తో పాటు అతడి తండ్రి తనను మోసం చేశారని సిరాజ్ ఆరోపించాడు. దీంతో పోలీసులు షౌబిన్తో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో షౌబిన్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్లో జరగనున్న సైమా అవార్డ్స్ వేడుకకు అటెండ్ అవ్వడం కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని షౌబిన్ కోర్టును అభ్యర్థించగా.. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. కేసుకి సంబంధించి ఒక కీలక సాక్షి దుబాయ్లో ఉన్నారని షౌబిన్ విదేశాలకు వెళ్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కోర్టు అనుమతి నిరాకరించడంతో షౌబిన్ షాహిర్ దుబాయ్ పర్యటన ముగిసినట్లు తెలుస్తుంది.