Chandra Sekhar Yeleti | చాలా మంది దర్శకులు ఒక సినిమా కమర్షియల్‌గా ఎంత సక్సెస్ అవుతుంది అని ఆలోచిస్తుంటారు. కానీ కొద్ది మంది దర్శకులు మాత్రమే కథను కొత్తగా చెప్పాలి..లేదంటే తెలిసిన కథనే కొత్తగా చూపించాలి అని అనుకుంటారు. అందులో మొదటి వరుసలో ఉండే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. కేవలం ఈయన తెలుగులో సినిమాలు తీసినందుకే ఇక్కడ ఉండిపోయాడు అని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. ఈయన ఆలోచనలు, సినిమాలోని పాత్రలు నిజజీవితం నుండి ప్రేరణ పొందినట్లు ఉంటాయి. ఈయన కెరీర్లో తీసినవి 7 సినిమాలు మాత్రమే. అందులో ప్రతి సినిమా ఒక్కో జోనర్లో తెరకెక్కాయి. శుక్రవారం ఈయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఫిబ్రవరి 4న 1973లో తునిలో చంద్రశేఖర్ యేలేటి జన్మించాడు. సీనిరంగంలో అడుగుపెట్టిన తర్వాత యేలేటి ఏ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయలేదు.మొదట ఈయన తన కజిన్ గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన ‘లిటిల్ సోల్జర్స్’ సినిమాకు ప్రొడక్సన్ టీంలో పనిచేశాడు. అటు తర్వాత అమృతం సిరీయల్‌కు మొదట దర్శకత్వం వహించాడు. పది ఎపిసోడ్లకు దర్శకుడిగా పనిచేసిన తర్వాత యేలేటి ‘ఐతే’ సినిమాను తెరకెక్కించాడు. అమృతం సిరియల్‌కు నిర్మాతగా వ్యవహరించిన గుణ్ణం గంగరాజు ‘ఐతే’ చిత్రాన్ని నిర్మించాడు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2003 ఏప్రిల్ 11న విడుదలైంది. కమర్షియల్‌గా ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించండంతో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇదే సినిమా తమిళ్లో ‘నామ్’గా, మలయాళంలో ‘వాంటెడ్’గా రీమేక్ అయింది.
‘ఐతే’ చిత్రం తర్వాత ఈయనకు విభిన్న కథలను తెరకెక్కించే దర్శకుడు అనే గుర్తింపు వచ్చింది. దీని తర్వాత ఛార్మీ, జగపతిబాబు, శశాంక్ ప్రధాన పాత్రల్లో ‘అనుకొకుండా ఒక రోజు’ అనే మిస్టరీ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. హీరోయిన్ లైఫ్‌లో ఒక రోజు మిస్సయింది. ఆ ఒక్క రోజు ఎలా మిస్సయింది? అసలు ఆ రోజు ఏం జరింగింది? అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్సిపీరియెన్స్ చంద్రశేఖర్ యేలేటి ఇచ్చాడు . డ్రగ్స్ వాడేవారు, మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్మేవారు ఇద్దరూ ఒకటే.. వీళ్లిద్దరూ పిచ్చివారే అనే సారాంశంతో ఈ చిత్రాన్ని ముగించాడు.
మ్యాచో స్టార్ గోపిచంద్‌తో, చంద్రశేఖర్ యేలేటి బాంబే బ్లడ్ గ్రూప్ అనే కాన్సెప్ట్‌తో ‘ఒక్కడున్నాడు’ సినిమాను తెరకెక్కించాడు. కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్ కాలేదు. ఈ చిత్రం కాన్సెప్ట్‌తోనే హాలీవుడ్లో ‘గెట్ ద గ్రింగో’ అనే సినిమా తెరకెక్కింది. హాలీవుడ్ సైతం మనోడి ఐడియాని తీసుకున్నాడంటే యేలేటి ఆలోచనలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు . ఆ తరువాత మంచు మనోజ్‌తో ‘ప్రయాణం’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మొత్తం ఏయిర్‌పోర్ట్‌లోనే తెరకెక్కింది. తరువాత వచ్చిన సాహసం, మనమంతా సినిమాలు కూడా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. ఈ రెండు చిత్రాలకు రావాలినంత గుర్తింపు రాలేదు. ఇక గతేడాది వచ్చిన చెక్ సినిమా తప్పితే ఈయన తెరకెక్కించిన 6 సినిమాలు ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యంలా ఉంటాయి.