Champion | ఐదు రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ‘ఛాంపియన్’ సినిమాకు మొదటిరోజు నుంచి ఆహా, ఓహో అనే స్థాయి టాక్ రాలేదు. అయితే “ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు” అనే డీసెంట్ స్పందనతోనే సినిమా ప్రయాణం మొదలైంది. టాక్ ఎలా ఉన్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా తన సత్తా చాటుతోంది. విడుదలైన కొద్ది రోజులలోనే స్టడీ కలెక్షన్లతో వీర విహారం చేస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచే ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అందుకు ప్రధాన కారణం స్వప్న సినిమాస్ బ్యానర్. ‘మహానటి’, ‘జాతిరత్నాలు’, ‘సీతారామం’ వంటి కల్ట్ చిత్రాలు అందించిన ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతోనే మొదటి నుంచే సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు టీజర్, ట్రైలర్లు కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
రిలీజ్ రోజున మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితి క్రమంగా మారింది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ అభిప్రాయాలు వెల్లువెత్తడంతో వర్డ్ ఆఫ్ మౌత్ బలపడింది. అదే ప్రభావం నేరుగా బాక్సాఫీస్ కలెక్షన్లపై పడింది. రోజు గడిచే కొద్దీ థియేటర్లలో ఆక్యుపెన్సీ మెరుగుపడుతూ, సినిమాపై ఆసక్తి పెరుగుతూనే ఉంది. నాలుగు రోజుల పాటు డీసెంట్ వసూళ్లు నమోదు చేస్తూ ‘ఛాంపియన్’ మంచి బజ్‌ను కొనసాగిస్తోంది. మొదటి రోజు తర్వాత నెమ్మదిగా పుంజుకున్న ఈ సినిమా, రెండో రోజు నుంచి స్టడీ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్ వర్గాలు థియేటర్లకు రావడం కలెక్షన్లకు బలంగా మారింది. కథలోని ఎమోషన్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘ఛాంపియన్’ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.12.51 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. షేర్ పరంగా చూస్తే రూ.7 కోట్ల వరకు రాబట్టింది. ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే ఇంకా సుమారు రూ.4 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. టాక్ మరింత పాజిటివ్‌గా కొనసాగితే, వీక్‌డేస్‌లో కూడా స్టడీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే, ‘ఛాంపియన్’ సేఫ్ జోన్లోకి వెళ్లడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.