Kangana Ranaut | మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా, 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో రూపొందిస్తున్న ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలను వాయిదా వేయాలని కేంద్ర సెన్సార్ బోర్డ్ చిత్ర నిర్మాతలను ఆదేశించింది. ఇందిరాగాంధీ పాత్రను పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో కంగనారనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సినిమాలో ఓ వర్గం మనోభావాలను కించపరిచారని, ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో మతపరంగా సున్నితమైన అంశాలు ఇందులో ఉన్నాయని సెన్సార్ బోర్డ్ చిత్రాన్ని వాయిదా వేసింది.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్మెంట్ కమిటీ కేంద్ర సెన్సార్ బోర్డ్‌కు లేఖ రాసింది. ఈ సినిమా ట్రైలర్లో తమ వర్గంపై అనుమానం రేకెత్తించేలా సున్నితమైన అంశాలను ప్రస్తావించారని, అవాస్తవాలను చూపించారని గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో చిత్ర విడుదలను వాయిదా వేశారు. ఇదిలావుండగా ఈ సినిమాపై నిషేధం విధించాలని దేశవ్యాప్తంగా పలు సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.