బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె సినిమా అంటే గ్లామర్ పాళ్లు ఎక్కువే ఉంటాయని భావిస్తారు సగటు యువ ప్రేక్షకులు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ శుక్రవారం రాత్రి నుంచే ప్రారంభమైంది. దీపికా పదుకొణె, హృతిక్ రోషన్ నాయికానాయకులుగా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారీ చిత్రాన్ని. ఇప్పటికే సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు ఇది రెండో చిత్రం. మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఏఏ అంశాల్లో సెన్సార్ ఎదుర్కొన్నదనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హాట్ సన్నివేశాల కారణంగా భారీగానే సెన్సార్ ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) మొత్తం నాలుగు సవరణలు చేసినట్లు వినికిడి. ధూమపాన వ్యతిరేకంగా సందేశాన్ని పేర్కొనాలనేది మొదటి మార్పు కాగా, ఈ సినిమాలోని రెండు డైలాగుల్లో అభ్యంతరకరంగా ఉన్న పదాలను తొలగించాలని లేదా వాటి స్థానంలో అభ్యంతరం లేని పదాలను చేర్చాలని సూచించింది. వీటితోపాటు చాలా అభ్యంతరకరంగా అర్ధనగ్నంగా ఉన్న విజువల్స్ తీసివేయాలని మరో 25 సెకన్ల ఆడియో స్థానంలో 23 సెకన్ల ఆడియో భర్తీ చేయించింది సెన్సార్ బోర్డు. ఈ మార్పులు చేసిన తర్వాతే జనవరి 19న ఫైటర్ నిర్మాతలకు యూ/ఏ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమా నిడివి 166 నిమిషాలు.. అంటే ఫైటర్ రన్ టైం 2 గంటల 46 నిమిషాలు.