Dhurandhar | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar) పై తలెత్తిన వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమా కథకు, అమరుడైన మేజర్ మోహిత్ శర్మ జీవితానికి ఎటువంటి సంబంధం లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) స్పష్టం చేసింది. మేజర్ మోహిత్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తమ అనుమతి లేకుండా ఈ సినిమాను తెరకెక్కించారంటూ ఆయన తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మీడియాతో పాటు, సోషల్ మీడియాలోనూ ఈ సినిమా మేజర్ మోహిత్ శర్మ జీవితాధారంగానే తెరకెక్కిందన్న చర్చ జరిగిందని, దీనిపై చిత్ర బృందం తమను సంప్రదించడం గానీ, స్పందించడం గానీ చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కారణంగా, సినిమాను తమకు ప్రత్యేకంగా చూపించాలని, అప్పటివరకు విడుదలను నిలిపివేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు CBFC ఈ సినిమాను పునః పరిశీలించింది.
పునః పరిశీలన అనంతరం ‘ధురంధర్’ చిత్రం కేవలం ఒక కాల్పనిక కథ (Fictional Story) అని, ఇది మేజర్ మోహిత్ శర్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడలేదని CBFC కోర్టుకు నివేదించింది. దీంతో ఈ సినిమాపై ఉన్న వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు అయింది.