Manchu Mohan Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబుపై కేసు నమోదైంది. మీడియా ప్రతినిధులపై దాడి కేసు వ్యవహారంలో మోహన్‌బాబు పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. జల్పల్లి నివాసానికి ఆయన తనయుడు మంచు మనోజ్ రాగా.. సిబ్బంది గేట్లు తెరిచేందుకు నిరాకరించారు. తన కూతురును తీసుకువెళ్తానంటూ గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. విష్ణు తరఫు బౌన్సర్లు మనోజ్‌ను, మీడియాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్‌బాబు మనోజ్‌పై చేయి చేసుకున్నారు.
ఆ తర్వాత ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై బూతుపురాణం అందుకున్నారు. తుపాకీ బయటకు తీసి చంపేస్తానని హెచ్చరించారు. అలాగే, గొడవపై స్పందించాలని కోరిన టీవీ మీడియా ప్రతినిధి మైక్ లాక్కొని అతనిపైనే దాడి చేశారు. బౌన్సర్ల దౌర్జన్యంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. దాడిని నిరసిస్తూ పలువురు జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. మోహన్‌బాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులపై దాడి కేసులో మోహన్‌బాబుపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. మోహన్‌బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలికి గాయం కావడంతో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.