Sri Reddy | టాలీవుడ్ వివాదాస్పద నటి, యూట్యూబర్ శ్రీరెడ్డిపై ఆంధ్రప్రదేశ్లో మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఈ నటిపై కర్నూలు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేష్, అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను గత నెల టీడీపీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు త్రీటౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసు ఉండగానే.. ఇదే విషయంపై తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మరో కేసు నమోదు అయ్యింది. శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, అనితలపై, అలాగే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి లపై అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిలర్ కింతాడ కళావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల పోలీసులు శ్రీరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.