Plastic surgery | కెనడాకు చెందిన యువ నటుడు వాన్ కొలూసికి (Von Colucci) దక్షిణ కొరియా (South Korean) పాప్ సింగర్ జిమిన్ (Jimin) అంటే విపరీతమైన అభిమానం. అది కాస్త శృతిమించింది. తన ఆరాధ్య సింగర్‌ను పోలిన ముఖాకృతితో కనిపించాలనుకున్నాడు. తన రూపురేఖల్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలను (Plastic surgery) ఆశ్రయించాడు. ఇప్పుడు అవే అతని ప్రాణాలు తీశాయి. సెయింట్ వాన్ కొలూసి (22) గత ఏడాది కాలంగా తన ముఖానికి 12 సర్జరీలను చేయించుకున్నాడు. వీటికోసం దాదాపు రెండు లక్షల డాలర్లకుపైగా ఖర్చు చేశాడు. అయితే గత నవంబర్‌లో అమర్చిన టీత్ ఇంప్లాంట్స్‌ను తొలగించుకోవడానికి దక్షిణ కొరియాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. సర్జరీ అనంతరం ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు.
పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరిన కొద్ది గంటల్లోనే మరణించాడు. కెనడాకు చెందిన వాన్ కొలూసి సంగీత ప్రపంచంలో అవకాశాల్ని వెతుక్కుంటూ 2019లో దక్షిణకొరియా చేరుకున్నాడు. అక్కడ ట్రెయినీ నటుడిగా పనిచేస్తున్నాడు. వాన్కొలూసి తన అందం విషయంలో అభద్రతాభావంతో ఉండేవాడని, దక్షిణ కొరియా నటుల మాదిరిగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉండేదని ఆయనకు పబ్లిసిటీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఎరిక్బ్లేక్ అనే వ్యక్తి వెల్లడించారు. చిన్న వయసులోనే వాన్ కొలూసి మరణించడంతో దక్షిణకొరియా సినీరంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి.