Bunny Vas | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న రిలీజ్‌కి రెడీ అయింది. ఈ సమయంలో థియేటర్ల బంద్ అంటూ హంగామా చేశారు. తమ డిమాండ్ల సాధనకు సినిమా థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబ్యూటర్లు నిర్మాతలను హెచ్చరించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా ? సినీ పెద్దలు, అగ్రనటులను వైసీపీ ప్రభుత్వం ఎలా చూసిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మరిచిపోయారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని అన్నారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిప్ట్ట్స్కి కృతజ్ఞతలు అంటూ పవన్ కల్యాణ్ కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటనను విడుదల చేసింది . అయితే పవన్ ప్రకటన వచ్చిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బన్నీ వాసు, నిర్మాత నాగ వంశీ స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేసామంటే.. మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది అని రాసుకొచ్చారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత నాగ వంశీ కూడా ఈ ఇష్యూపై స్పందిస్తూ… కీలకమైన సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో అనవసరంగా కొత్త సమస్యలు సృష్టించారు. ఇప్పుడు అవే పెద్ద సమస్యలుగా మారాయి. కామన్ సెన్స్ తో ఆలోచించి ఉంటే ఎలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు కదా అని నాగ వంశీ తన ట్వీట్లో పేర్కొన్నారు. థియేటర్ల బంద్ అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే అని, జూన్ 1న థియేటర్ల బంద్ ఉండడం లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. తెలుగు ఫిలిం ఛాంబర్ లో సమావేశమైన నిర్మాతలు శనివారం రోజు ఈ ప్రకటన చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటామని, అవసరమైతే ప్రభుత్వాలతో చర్చిస్తామని ఫిలిం ఛాంబర్ పేర్కొంది.