Buchi Babu | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. దర్శకుడు బుచ్చాబాబు సన రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే సినిమా విజయంతో పాటు కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరు, కొన్ని సన్నివేశాల్లో మహిళల ప్రాతినిధ్యంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ ప్రకటన విడుదల చేస్తూ వివరణ ఇచ్చారు. అవసరమైతే క్షమాపణలు చెప్పడానికీ వెనుకాడలేదు.
తన ప్రకటనలో బుచ్చిబాబు మాట్లాడుతూ, ఒక దర్శకుడిగా తాను ఎప్పుడూ ప్రేక్షకులను అలరించడమే కాకుండా వారితో భావోద్వేగంగా కనెక్ట్ కావాలని ప్రయత్నిస్తానని తెలిపారు. అదే సమయంలో ఎవరినీ అసౌకర్యానికి గురిచేయడం లేదా అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు . సినిమా విడుదలైన తర్వాత కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి వచ్చిన అభిప్రాయాలు మా దృష్టికి వచ్చాయి. వాటిని మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ప్రేక్షకుల అభిప్రాయాలను ఎప్పుడూ గౌరవిస్తాం అని పేర్కొన్నారు. మహిళల ప్రాతినిధ్యంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, తెరపైనైనా, తెరవెనుకైనా మహిళల పట్ల తనకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉందని బుచ్చిబాబు తెలిపారు.
ఏ మహిళా పాత్రను వస్తువుగా చూపించడం లేదా అగౌరవపరచడం మా ఉద్దేశం ఎప్పుడూ కాదు. ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలు. ప్రేక్షకుల్లో ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను అని ఆయన అన్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సంబంధిత సన్నివేశాల్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు బుచ్చిబాబు వెల్లడించారు. ప్రేక్షకుల అభిప్రాయాలను సమీక్షించిన తర్వాత కొన్ని భాగాల్లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమా ఎదగాలంటే ప్రేక్షకుల మద్దతు అవసరం. కథ చెప్పే వారిగా సమాజంలో వస్తున్న మార్పులను, సున్నితమైన అంశాలను గౌరవించడం మా బాధ్యత అని తెలిపారు. భవిష్యత్తులో కూడా మహిళల పాత్రలను మరింత శక్తివంతంగా, గౌరవప్రదంగా చూపించే కథలనే చెప్పేందుకు కట్టుబడి ఉన్నామని బుచ్చిబాబు స్పష్టం చేశారు.
ప్రతి మహిళ విలువైనదే. వారి వ్యక్తిత్వాన్ని, బలాన్ని ప్రతిబింబించే కథలు చెప్పేందుకు మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం. ప్రేక్షకుల నుంచి వచ్చిన నిజాయితీగల అభిప్రాయాలకు కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా, విమర్శల నేపథ్యంలో దర్శకుడు స్వయంగా స్పందించి వివరణ ఇవ్వడంతో పాటు అవసరమైన మార్పులు చేస్తామని ప్రకటించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.
I have always had immense respect for…
— BuchiBabuSana (@BuchiBabuSana) June 6, 2026