హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆనందమానందమాయే’. ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇటీవల ‘ఆనందమాయే..’ అనే గీతాన్ని విడుదల చేశారు. శాండిల్య పీసపాటి స్వరపరచిన ఈ పాటను శ్రీసాయి కిరణ్ రచించగా, మనీషా ఈరబత్తిని, యశ్వంత్ నాగ్ అలపించారు. భిన్న వ్యక్తిత్వాలు కలిగిన నాయకానాయికల మధ్య ప్రేమను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. వినసొంపైన బాణీతో హృదయానికి హత్తుకునేలా పాటను రూపొందించామని మేకర్స్ తెలిపారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య, రచన-దర్శకత్వం: ఆర్వీఎస్ నిఖిల్.