సోషల్‌మీడియా వల్ల సినీ తారలకు మంచి ప్రచారం లభించడంతో పాటు కొన్నిసార్లు సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ నటి రాధిక ఆప్టేకు ప్రస్తుతం అలాంటి అనుభవమే ఎదురవుతోంది. ఆమె కథానాయికగా 2015లో రూపొందిన చిత్రం ‘పార్చ్డ్’. గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాజిక కట్టుబాట్ల కారణంగా నలుగురు మహిళలకు ఎదురైన సమస్యల్ని ఆవిష్కరిస్తూ దర్శకురాలు లీనాయాదవ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రాధికా ఆప్టే నటించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అభ్యంతరకర సన్నివేశాల్లో రాధిక ఆప్టే నటించడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సినిమాలు భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను కించపరచడంతో పాటు నాశనం చేసేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. శనివారం ‘బాయ్‌కాట్ రాధిక ఆప్టే’ పేరుతో హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్‌గా మారింది. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై రాధిక ఆప్టే ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి!.