‘మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఓ ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఒక్కొక్క సీన్ తీస్తుంటే నేను నేలపై లేను.. గాలిలో ఉన్నాననిపించింది. ఫస్ట్‌టైమ్ మహేశ్‌ని రాముడి వేషంలో ఫొటో షూట్ చేస్తుంటే గూజ్బంప్స్ వచ్చాయి. మహేశ్ కొంటెగా ఉంటాడు. కృష్ణుడిగా బావుంటాడనుకుంటూనే ఫొటో షూట్ చేశాం. కానీ రాముడిగా అత్యద్భుతంగా ఉన్నాడు’ అని అన్నారు అగ్ర దర్శకుడు రాజమౌళి. మహేశ్‌బాబు కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీకి ‘వారణాసి’ అనే పేరును ఖరారు చేశారు. శనివారం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ‘గ్లోబ్ ట్రాటర్’ పేరిట నిర్వహించిన ఈ సినిమా భారీ ఈవెంట్లో వేలాది అభిమానుల సమక్షంలో టైటిల్‌ను, గ్లింప్స్‌ను విడుదల చేశారు. వీడియో గ్లింప్స్‌లో మహేష్‌బాబు నందిపై త్రిశూలాన్ని చేతబూని ఉగ్రరూపంలో వస్తూ కనిపించారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘నేను చిన్నప్పట్నుంచీ ఎన్టీఆర్‌గారి అభిమానిని. అయితే.. సినిమా అంటే ఏంటో తెలిశాక కృష్ణగారి గొప్పతనం అర్థమైంది. తెలుగు సినిమాను టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్లింది ఆయనే. అలాంటి కృష్ణగారి అబ్బాయితో సినిమా తీస్తూ ఎలాంటి సినిమా చేయాలి? సాంకేతికంగా ఎలా ఉండాలి? ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఇండియాలో ఫస్ట్ ఫుల్ స్క్రీన్ ఐమ్యాక్స్ ఫార్మాట్లో ఈ సినిమా రూపొందుతున్నది. ఈ సినిమాలో ప్రతీది కొత్తగా ఉండేలా ప్లాన్‌చేశాం. అన్నింటినీ దాటుకుంటూ రాముడి తాలూకు సీక్వెన్స్‌ని కంప్లీట్ చేశాం. నా కెరీర్లోనే కాదు, మహశ్ కెరీర్లో కూడా మోస్ట్ మెమొరబుల్ సీక్వెన్స్ అది. రాముడిగా మహేష్‌బాబు మీరు ఊహించిన దానికంటే దయార్థ్ర హృదయంతో కనిపిస్తాడు.. దివ్యమంగళంగా అనిపిస్తాడు.. ఉగ్రరూపంలో మెరిపిస్తాడు. త్వరలోనే ట్రైలర్‌తో వస్తాం’ అని అన్నారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ‘ఈ స్టేజీ మీదకు సింపుల్‌గా నడిచి వస్తానంటే రాజమౌళి కుదరదని చెప్పాడు. ఇలా కొత్తగా డ్రెస్ డిజైన్ చేశారు. ఇదంతా మీకోసమే. ఈ గ్లింప్స్ గురించి నా డైలాగ్‌లో చెప్పాలంటే.. దిమ్మతిరిగి మైండ్‌బ్లాక్ అయింది. నేను పౌరాణిక సినిమాల్లో బాగుంటానని నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు.
ఎందుకోగానీ నేను ఆయన మాట వినలేదు. కానీ ఈ సినిమాలో ఆయన మాటను పాటించాను. ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితకాలంలో ఒకేసారి వరించే అవకాశం. ఈ సినిమా కోసం ఎంతకష్టమైనా పడతాను. ఇది రిలీజైనప్పుడు భారతదేశం మొత్తం గర్వంగా ఫీలవుతుంది. ముందుముందు ఈ సినిమా ఎలా ఉండబోతున్నదో మీ ఊహకే వదిలేస్తున్నా’ అన్నారు. దిగ్గజ కళాకారులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని కథానాయిక ప్రియాంకచోప్రా పేర్కొంది. ఇంకా పృథ్వీరాజ్ సుకుమార్, ఎం.ఎం.కీరవాణి, రచయిత విజయేంద్రప్రసాద్ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవలే దివంగతులైన తెలంగాణ ప్రజాకవి అందెశ్రీకి చిత్రబృందం నివాళులు అర్పించారు.