ఏ రంగంలోనైనా ధైర్యంగా ముందడుగు వేసే మహిళలను ప్రశంసిస్తానని అంటున్నది బాలీవుడ్ తార ఆలియా భట్. వ్యాపారవేత్తలుగా మారిన తోటి నాయికలకు తన వంతు సహకారం ఉంటుందని ఆలియా చెప్పింది. ఇటీవల బాలీవుడ్ నాయికలు సినిమాల్లో నటిస్తూనే తమ సొంత ఫ్యాషన్, స్కిన్‌కేర్ బ్రాండ్స్ ప్రారంభిస్తున్నారు. వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ప్రియాంక చోప్రా మొదలు దీపికా పడుకోన్ వరకు ఎంతోమంది హీరోయిన్లు వ్యాపారరంగంలో అడుగుపెట్టారు. దీపికా పడుకోన్ ‘ఆల్ అబౌట్ యు’ అనే ఫ్యాషన్ బ్రాండ్ స్థాపించగా…కత్రీనా కైఫ్ ‘కే బ్యూటీ’ అనే స్కిన్ కేర్ బ్రాండ్ మీద అమ్మకాలు చేస్తున్నది.
ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా భట్ ‘ఎడ్ ఎ మమ్మా’ అనే దుస్తుల కంపెనీ బ్రాండ్ ఆరంభించింది. నాయికలు ఇలా సినీరంగంతో పాటు సొంత బ్రాండ్స్ ప్రారంభించడంపై ఆలియా భట్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ…‘నాతో సహా తోటి నాయికలు చాలా మంది ఫ్యాషన్, స్కిన్‌కేర్ వ్యాపారవేత్తలుగా మారారు. వాళ్ల కోసం వీలైనంత ప్రచారం చేస్తా. నేను సపోర్ట్ చేస్తున్నది వారు కేవలం మహిళలు అని కాదు ..కొత్త పనిని మొదలుపెట్టే వారి ధైర్యాన్ని ఇష్టపడతాను. వాళ్లు ఏం చేయగలరో నిరూపించుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ప్రశంసిస్తా’ అని చెప్పింది. ఆలియా భట్ ప్రస్తుతం ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ చిత్రంలో నటిస్తున్నది.