Shraddha Kapoor | వైవిధ్యమైన కథా చిత్రాలతో బాలీవుడ్లో ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును తెచ్చుకుంది శ్రద్ధాకపూర్. ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైందీ భామ. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ కాంబోలో రూపొందుతున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో శ్రద్ధాకపూర్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇటీవలే ఈ సినిమా షూట్లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు.
ఆయన్ని మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ దర్శకుడు ప్రశాంత్‌నీల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని అంటున్నారు. ఈ సినిమా ద్వితీయార్ధంలో వచ్చే కీలకమైన పాత్ర కోసం చిత్ర బృందం శ్రద్ధాకపూర్‌ను సంప్రదించినట్లు తెలిసింది. తక్కువ నిడివి కలిగిన అతిథి పాత్రే అయినా కథను మలుపుతిప్పే విధంగా ఉంటుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రవిబస్రూర్ స్వరకర్త. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.