Bigg Boss Telugu 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సండే ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. షో హోస్ట్ నాగార్జున ఈ ఎపిసోడ్లో బిగ్ బాస్ టైటిల్ ప్రైజ్ మనీని అధికారికంగా రివీల్ చేయడంతో పాటు ఫైనలిస్ట్‌లను కూడా ఖరారు చేశారు. ఈ సీజన్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందజేస్తామని నాగార్జున ప్రకటించారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులను ఒక్కొక్కరిని పిలిచి.. “టైటిల్ గెలిస్తే ఈ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు?” అని అడగ్గా, ఇమ్మాన్యుయేల్ ఇచ్చిన సమాధానం అందరి హృదయాలను తాకింది. తాను అమ్మా నాన్నల కోసం అప్పులు చేసి ఇల్లు కట్టినట్లు చెప్పిన ఇమ్మాన్యుయేల్, టైటిల్ గెలిస్తే ముందుగా ఆ అప్పులు తీర్చేస్తానని భావోద్వేగంగా వెల్లడించాడు. తనను నమ్మి ప్రేమిస్తున్న ఓ అమ్మాయి డాక్టర్ చదువుతోందని, ఆమె పీజీ చదువుకు కొంత డబ్బు ఉపయోగిస్తానని చెప్పాడు. అలాగే తన కుటుంబానికి, అక్క పిల్లల చదువులకు కూడా మిగిలిన డబ్బును వినియోగిస్తానని వెల్లడించాడు.
ఇక భరణి మాత్రం తాను టైటిల్ గెలిస్తే చారిటీకి, ఓల్డేజ్ హోమ్ కోసం ప్రైజ్ మనీని వినియోగిస్తానని తెలిపారు.అనంతరం ఫైనలిస్ట్‌లను రివీల్ చేసే ప్రక్రియ మొదలైంది. కళ్యాణ్ ఇప్పటికే ఫైనలిస్ట్‌గా ఖరారవగా, మిగిలిన ఐదుగురిని నాగార్జున స్విమ్మింగ్ పూల్ వద్దకు పిలిచారు. పూల్‌లో ఉన్న ప్రత్యేక ఆకారాలను ఉపయోగించి నిర్వహించిన టాస్క్‌లో చివరికి తనూజ పేరు రివీల్ కావడంతో ఆమె రెండవ ఫైనలిస్ట్‌గా నిలిచింది. మూడవ ఫైనలిస్ట్‌గా డిమాన్ పవన్ ఎంపికయ్యాడు. కళ్యాణ్ హ్యామర్‌తో గోడను పగలగొట్టగా అందులో పవన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నాల్గవ ఫైనలిస్ట్‌గా ఇమ్మాన్యుయేల్ నిలిచాడు. చివరగా సంజన, భరణి మధ్య ఫైనలిస్ట్ స్థానం కోసం ఉత్కంఠభరితమైన టాస్క్ జరిగింది.
ఫీనిక్స్ బర్డ్ యాక్టివిటీలో చివరికి సంజన ఫైనలిస్ట్‌గా నిలవగా, భరణి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టాప్ 5 ఫైనలిస్ట్‌లు ఖరారయ్యారు. కళ్యాణ్, తనూజ, పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఫైనలిస్ట్‌లుగా నిలిచారు. భరణికి ఇంటి సభ్యులు భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. టాప్ 5 సభ్యులు గార్డెన్ ఏరియాలో కలిసి సెలబ్రేషన్ చేసుకుంటూ ఫైనల్‌కు సిద్ధమయ్యారు. ఇప్పుడు టైటిల్ ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో మరింతగా పెరిగింది.ఈ ఆదివారంతో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.