Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9 శనివారం ఎపిసోడ్ నవ్వులు, భావోద్వేగాలు, పంచాయితీలతో సందడి చేసింది. ఎపిసోడ్ మొదటిలోనే దివ్య – తనూజ మధ్య జరిగిన గొడవపై నాగార్జున క్లాస్ పీకారు. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవలపై హౌస్మేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు. భరణి తప్పు తనూజదేనని చెప్పగా, ఇమ్మాన్యుయేల్ మాత్రం “దివ్య కూడా కొన్ని మాటల్లో హద్దులు దాటింది” అని స్పష్టం చేశాడు. ఇక హౌస్‌లో గొడవలు, అరుపులు వంటివి వినపడకూడదని నాగార్జున స్పష్టం చేశారు. “ఎదుటివారు అరుస్తున్నారు కాబట్టి నువ్వూ అరిచి గొడవ పెంచడం సరైంది కాదు. కెప్టెన్ అయ్యాక కళ్లూ నెత్తికెక్కాయా?” అంటూ తనూజపై గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు.
నాగార్జున చూపించిన వీడియోలో దివ్య తనూజ గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. “జీవితంలో ఆమె ముఖం చూడను… బిగ్ బాస్ తరువాత కూడా ఆమెను చూడాలని లేదు” అని దివ్య భరణికి చెప్పిన సంభాషణ హౌస్‌లో కొత్త చర్చ మొదలైంది.మరోవైపు స్పెషల్ గెస్ట్‌గా నాగబాబు ఎంట్రీ ఇవ్వగా, ఆయనతో పాటు భరణి తల్లి కూడా రావడం హౌస్‌ను భావోద్వేగంతో నింపింది. వారిద్దరిని చూసిన భరణి ఆనందంతో కంటతడి పెట్టాడు.“నా గురువు – నా తల్లి వచ్చారు… దీనికంటే బెస్ట్ మూమెంట్ లేదు” అంటూ ఎమోషనల్ అయ్యాడు.నాగబాబు కూడా భరణితో తన అనుబంధం గురించి చెప్పారు. సీరియల్స్‌లో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ .. అప్పుడు భరణి చాలా అగ్రెసివ్… ఇప్పుడు బిగ్ బాస్ వల్ల గంగి గోవులా మారిపోయాడు! మరీ అంత సాఫ్ట్‌నెస్ అవసరం లేదు అని సరదాగా అన్నారు.
ఇక నాగార్జున ఇచ్చిన ఫొటోలలో టాప్ 5 గా భరణి, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, సంజనని పెట్టారు. ఆ తర్వాత ఓ బాక్స్ నుండి తీసిన ‘సినిమా క్యారెక్టర్స్’ను హౌస్‌మేట్స్‌కు మ్యాచ్ చేయమని అడగగా, నాగబాబు సరదాగా స్పందించారు. గజినీ – భరణి (ఏం చేయాలో మరచిపోతున్నాడని సెటైర్), హాసిని – రీతూ (ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందంటూ, కొన్నిసార్లు “ఎస్వీ రంగారావు మాయాబజార్లో నవ్వినట్టుంది” అని జోకు చేశారు). ఆ తర్వాత కళ్యాణ్ తండ్రి, తమ్ముడు రావడంతో కళ్యాణ్ కంటతడి పెట్టాడు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ కళ్యాణ్ తండ్రి భావోద్వేగంగా మాట్లాడి అందరినీ కదిలించారు. అనంతరం ఇమ్మాన్యుయేల్ సోదరుడు, కమెడియన్ అవినాష్ ఎంట్రీ ఇవ్వగానే హౌస్ మొత్తం కామెడీగా మారింది.. తనూజ, రీతూ, పవన్‌లను సరదాగా ఆటపట్టిస్తూ అవినాష్ అదరగొట్టాడు. క్యారెక్టర్ బాక్స్‌లో నుండి మహానటి ట్యాగ్ తీసి.. తనూజకు (సరదాగా “నీ నటన గొప్పది కాబట్టే” అంటూ) ఇచ్చాడు. కట్టప్ప కూడా తనూజకే (ఫన్నీగా “హౌస్‌లో నలుగురికైనా వెన్నుపోటు పొడిచావ్” ) అని సెటైర్ వేశాడు.