Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్లో రీతూ చౌదరీ ఎలిమినేట్ కావడంతో హౌజ్‌లో మరింత ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఊహించని విధంగా రీతూ ఎలిమినేషన్ కంటెస్టెంట్లందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో షో 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఫైనల్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో హౌజ్‌లోని ప్రతి టాస్క్, ప్రతి నామినేషన్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరనేది చూస్తే.. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, సంజనా, భరణి ఉన్నారు.
టికెట్ టు ఫినాలే టాస్క్‌లో గెలిచిన కళ్యాణ్ ఇప్పటికే ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఇక మిగిలిన ఆరుగురు ఫైనల్ రేసులో పోటీ పడుతున్నారు. ఈ వారం హౌజ్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే ఈ వారం నామినేషన్ నుంచి ఒకరు సేవ్ అయ్యే అవకాశముందని కూడా సూచించారు. అందువల్ల ఈ వారం డ్రామా మరింత ఆసక్తికరంగా మారింది. డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉన్నందున, టాప్ 5లో ఎవరు చేరతారన్నదానిపై అభిమానుల్లో భారీ చర్చ మొదలైంది. టాప్ 5 ర్యాంకులు నిర్ణయించేందుకు బిగ్ బాస్ ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. ఆరు పెట్టెలలో వివిధ అమౌంట్లను ఉంచి, బాల్‌ను పట్టుకున్న కంటెస్టెంట్ ఎవరికి ఏ మొత్తం ఇవ్వాలో కారణం చెప్పి నిర్ణయించాల్సి వచ్చింది.
డీమాన్ పవన్ – సుమన్ శెట్టికి ₹1,00,000, భరణి – తనూజకు ₹2,00,000, కళ్యాణ్ – ఇమ్మాన్యుయెల్‌కు ₹2,50,000.. ఈ కేటాయింపులతో ఇమ్మాన్యుయెల్ టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. తదుపరి రౌండ్లో ఇమ్మాన్యుయెల్ సంజనాకు ₹1,50,000 ఇవ్వగా, అందరూ రిజెక్ట్ చేశారు. చివరకు సంజనాకు ‘జీరో అమౌంట్’, భరణికి ₹50,000గా ఇచ్చారు. జీరో అమౌంట్ రావడంతో బిగ్ బాస్ సంజనాను ‘జైలు’లో పెట్టమని ఆదేశించాడు. దీంతో సంజనా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన మరో టాస్క్‌లో బాల్స్‌ని రింగ్‌లో వేయడం జరిగింది. ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయెల్, భరణి, డీమాన్ పవన్, తనూజ, సుమన్ శెట్టి టాప్ 5గా నిలిచారు. వీరిలోనే విన్నర్ రేస్ మరింత వేడెక్కుతోంది. సోమవారం ఎపిసోడ్లో భరణికి ప్రత్యేక బంపర్ ఆఫర్ ఇచ్చి హౌజ్ మేట్స్‌ను ఆశ్చర్యపరిచాడు బిగ్ బాస్. అయితే ఆ ఆఫర్ వివరాలు రాబోయే ఎపిసోడ్స్‌లో వెల్లడికానున్నాయి. సోమవారం ఎపిసోడ్ పెద్దగా ఆకట్టుకోకపోయినా, ర్యాంకింగ్ టాస్క్, జైలు డ్రామా, టాప్ 5 ప్రకటనతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది.