Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ వారంతో షో ముగియనుండగా, వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలేలో విజేత ఎవరో తేలనుంది. గత వారం భరణి, సుమన్ శెట్టి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌజ్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరంతా ఫైనల్‌కు చేరుకుని టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. సోమవారం ఎపిసోడ్లో బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్లను తమ ప్రయాణాన్ని పంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లు, భావోద్వేగాలను వెల్లడించారు. చాలా మంది భావోద్వేగానికి లోనవుతూ కంటతడి పెట్టారు. ఇమ్మాన్యుయెల్ మాట్లాడుతూ, బిగ్‌బాస్‌కు ముందు మరో షోలో మంచి పొజిషన్లో ఉన్నానని, ఈ ఆఫర్ వచ్చినప్పుడు వెళ్లాలా? వద్దా? అనే డైలామాలో పడ్డానని చెప్పారు. ‘నవ్వించడం ఈజీనే’ అనుకుని వచ్చానని, కానీ మొదటి వారంలో హరీష్‌తో గొడవ తర్వాత తనపై తానే సందేహపడినట్లు తెలిపారు.
ఆ సమయంలో అమ్మ సంజనా తనకు ధైర్యం నింపిందని, ఇంత దూరం వస్తానని ఊహించలేదని చెప్పారు. బిగ్‌బాస్ తర్వాత తన జీవితం మరో లెక్క అని పేర్కొన్నారు. సంజనా మాట్లాడుతూ, రెండు మూడు వారాలు ఉంటేనే ఎక్కువ అనుకున్నానని, కానీ టాప్ 5లో ఉండటం తనకు విశేషంగా అనిపిస్తోందని చెప్పారు. తనపై ఉన్న నిందను బ్రేక్ చేసి గౌరవంతో బయటకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ షోకి వచ్చానని తెలిపారు. ఇమ్మాన్యుయెల్ లాంటి కొడుకు దక్కడం తన అదృష్టమని అన్నారు. పవన్ తన జీవన ప్రయాణాన్ని భావోద్వేగంగా పంచుకున్నారు. నాన్నకు క్యాన్సర్ ఉండటంతో ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్‌కి రావడం తనకు పెద్ద నిర్ణయమని చెప్పారు. స్పోర్ట్స్ వైపు వెళ్లాలనుకున్నా కుటుంబం ఒప్పుకోలేదని, ఆ తర్వాత వచ్చిన కొన్ని ఆఫర్లు కూడా చేజారిపోయాయని తెలిపారు. టీనేజ్ నుంచే ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నానని, చిన్న చిన్న జాబ్స్ చేసి నిలబడేందుకు ప్రయత్నించానని చెప్పారు. బిగ్‌బాస్ అవకాశం తనకు జీవితంలో వచ్చిన గొప్ప ఛాన్స్ అని పేర్కొన్నారు.
కళ్యాణ్ మాట్లాడుతూ, బిగ్‌బాస్ అనేది మనమే కావాలని తెచ్చుకున్న కష్టం అని అన్నారు. ఫుడ్, మనుషులు, పరిస్థితులు అన్నీ కష్టంగానే ఉంటాయని, అయినా మనకు ఇదే కావాలని వచ్చామని చెప్పారు. ఈ షో తనకు మంచి అన్నను, తనూజ లాంటి మంచి స్నేహితురాలిని ఇచ్చిందని, ఆ స్నేహం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. తనూజ మాట్లాడుతూ, సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం లేకపోయినా తన నిర్ణయంతో ముందుకు వచ్చానని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమ తనను ఆదరించి ఈ స్థాయికి తీసుకువచ్చిందని తెలిపారు. బిగ్‌బాస్ తనకు చాలా విషయాలు నేర్పిందని, ఇకపై ఎవరినీ లెక్కచేయకుండా తనకు నచ్చినట్టే జీవించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండటం ఈ షో వల్ల నేర్చుకున్నానని చెప్పారు.
ఇక హౌజ్‌లో ఇచ్చిన పలు టాస్క్‌లలో పవన్ గెలిచి తనకు కావాల్సిన ట్రీట్ పొందాడు. ఈ సందర్భంగా కిచెన్‌లో సరదా చర్చ నడుస్తుండగా, పవన్‌ని ఉద్దేశిస్తూ..కంటెంట్ కోసం కొన్ని పనులు చేస్తున్నానని తనూజ వ్యాఖ్యానించింది. దీనిపై పవన్ స్పందిస్తూ, కంటెంట్ కోసమే అయితే మొదట్నుంచే తాను ఆమె వెంటపడేవాడినని అన్నారు. దీంతో తనూజ సీరియస్ కావడంతో కొద్దిసేపు హౌజ్ హీటెక్కింది. అనంతరం పరిస్థితి కూల్ అయ్యింది.