Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఇటీవల గ్రాండ్‌గా ముగిసిన సంగతి తెలిసిందే. కామనర్ కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ పడాల టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. సీరియల్ నటి తనూజ రన్నరప్‌గా నిలవగా, డీమన్ పవన్ మూడో స్థానం, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానం, కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ టైటిల్ గెలవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. పలువురు మాజీ కంటెస్టెంట్స్ కల్యాణ్‌కు పీఆర్‌లా మారిపోయారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజా వివాదం సంజనా గల్రానీ, గీతూ రాయల్ మధ్య పెద్ద ఎత్తున చెలరేగింది.
ఈ గొడవకు కారణం బిగ్‌బాస్ రివ్యూవర్ మహిధర్ చేసిన ఓ వీడియో. ఆ వీడియోను సంజనా గల్రానీ ముందుగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో మహిధర్, సంజనను బిగ్‌బాస్ కంటెంట్ క్రియేటర్‌గా పేర్కొంటూ, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఆటపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. అలాగే కేవలం రివ్యూవర్ల వల్లే పవన్ కల్యాణ్ హైలైట్ అయ్యాడని వ్యాఖ్యానించాడు. ఈ వీడియోకు నెటిజన్లు మరింత దుమారం జోడించారు. కల్యాణ్ కోసం ఆదిరెడ్డి, గీతూ రాయల్లను ఓట్ల బిచ్చగాళ్లలా చూపిస్తూ ఒక ఫోటోను ఆ వీడియోకు జతచేసి వైరల్ చేశారు. అదే వీడియోను సంజనా షేర్ చేయడంతో గీతూ రాయల్ తీవ్రంగా స్పందించింది.
వెంటనే గీతూ రాయల్ సంజనాకు కౌంటర్ ఇస్తూ, డ్రగ్స్ కేసులో సంజనపై ఆరోపణలున్నాయని పేర్కొంటూ ఒక పాత వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ఇది నిజమా?” అంటూ గట్టిగానే ప్రశ్నించింది. అయితే ఏమైందో తెలియదు కానీ కొద్దిసేపటికే సంజనా తన పోస్ట్‌ను డిలీట్ చేయగా, అనంతరం గీతూ రాయల్ కూడా తాను షేర్ చేసిన వీడియోను తొలగించింది. కానీ అప్పటికే ఆలస్యం అయింది. ఇద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్క్రీన్షాట్లు తీసి విస్తృతంగా షేర్ చేస్తున్నారు. బిగ్‌బాస్ టైటిల్ గెలుపు ఇప్పుడు ట్రోఫీ కంటే పెద్ద వివాదంగా మారడం టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.