Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి రోజు ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించింది. హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ ప్రత్యేక ఈవెంట్స్‌ను ప్లాన్ చేయగా, హౌస్ మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది. గెస్టుల రాకతో సరదా, సెటైర్లు, ఆటలు, డ్యాన్స్‌లు అన్నీ కలిసొచ్చి ఎపిసోడ్‌ను మరింత ఎనర్జిటిక్‌గా మార్చాయి.హీరో శివాజీ లయతో కలిసి హౌస్‌లోకి అడుగుపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీక్రెట్ రూమ్ నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన శివాజీని చూసి టాప్ 5 కంటెస్టెంట్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తూ, చమత్కారాలతో నవ్వులు పూయించాడు. ముఖ్యంగా డీమాన్ పవన్–రీతూ మధ్య గతంలో జరిగిన ప్రేమ సన్నివేశాలను శివాజీ, లయ కలిసి పునఃసృష్టించగా, పవన్ సిగ్గుపడటం ప్రేక్షకులకు ప్రత్యేకంగా అనిపించింది.
ఇక యాంకర్ ప్రదీప్ హౌస్‌లోకి వచ్చి ఇమ్మాన్యుయేల్‌ను ఆటపట్టించాడు. గతాన్ని గుర్తు చేస్తూ సరదా సెటైర్లు వేయగా, హౌస్ మొత్తం నవ్వులతో మార్మోగింది. ప్రదీప్ హోస్ట్ చేసిన గేమ్స్, అలాగే శ్రీముఖితో కలిసి నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్ టాప్ కంటెస్టెంట్స్ మనసులో మాటలను బయటపెట్టాయి. శ్రీముఖి రాకతో హౌస్‌లో ఎనర్జీ మరింత పెరిగింది. ఆమె ఇచ్చిన చిన్న టాస్క్‌లో కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్ వేర్వేరు సినిమా క్యారెక్టర్స్‌లో నటిస్తూ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో పుష్పరాజ్ క్యారెక్టర్లో ఉన్న ఇమ్మాన్యుయేల్, భానుమతిగా నటించిన తనూజతో ‘కిస్ కిస్ కిస్సుక్కు’ సాంగ్‌కు డ్యాన్స్ చేయిస్తానంటూ సరదాగా అనడం హౌస్‌లో నవ్వులు పూయించింది.
గ్రాండ్ ఫినాలేకు ముందు జరిగిన ఈ హై ఎనర్జీ ఎపిసోడ్ తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ముందుగా సంజనా ఎలిమినేట్ కాగా, అనంతరం ఇమ్మాన్యుయేల్ కూడా ఫైనల్ రేస్ నుంచి బయటకు వెళ్లాడు. ప్రస్తుతం హౌస్‌లో కళ్యాణ్ పడాల, తనూజ, పవన్ మాత్రమే మిగిలారు. విజేత ఎవరు అనే ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా కళ్యాణ్ పడాల, తనూజ మధ్య గట్టి పోటీ కనిపిస్తుండగా, టైటిల్‌కు కళ్యాణ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కిరీటం ఎవరి తలపై నిలుస్తుందో చూడాలి.