Bigg Boss 9 | కింగ్ నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న బిగ్ బాస్ తెలుగు 9 సండే ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. సాధారణంగా ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటంతో ఎవరు బయటకు వెళ్లబోతున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉరకలేసింది. అయితే చివర్లో ఎవరూ ఊహించని విధంగా భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. సండే ఎపిసోడ్లో మొదటగా హౌస్మేట్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు బిగ్ బాస్ డయాస్‌పైకి వచ్చారు. రీతూ చౌదరికి సపోర్ట్‌గా మాజీ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్, ఆమె అన్నయ్య హాజరయ్యారు. రీతూ నెగిటివ్ వైబ్‌తో షోలోకి వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ నెగిటివిటీ మొత్తం పాజిటివ్‌గా మారిందని అఖిల్ ప్రశంసించాడు. అలాగే టాప్ 5గా రీతూ, తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్ నిలుస్తారని తన అంచనాలు వెల్లడించాడు.
అనంతరం పవన్ తండ్రి, అతడి స్నేహితుడు డయాస్‌పైకి వచ్చి పవన్‌కు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ సమయంలో పవన్ భావోద్వేగాలకు లోనయ్యాడు. తర్వాత తనూజకు సపోర్ట్‌గా బుల్లితెర నటి హరిత ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ కలిసి నటించిన ముద్దమందారం సీరియల్ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. ఎలిమినేషన్ రౌండ్లో కళ్యాణ్, సంజన, భరణి, దివ్య నామినేట్ అయ్యారు. వీరిలో కళ్యాణ్, భరణి ముందుగా సేవ్ అయ్యారు. చివరికి సంజన, దివ్య మాత్రమే మిగిలి ఉండగా, వారిని గార్డెన్ ఏరియాలోకి పంపించారు. ఈ సమయంలో నాగార్జున, ఇమ్మాన్యుయేల్‌ను పవర్ అస్త్ర గురించి ప్రశ్నించారు. ఈ అస్త్రాన్ని వాడితే ఈ వారం ఎలిమినేషన్ పూర్తిగా రద్దవుతుందని చెప్పారు. ఇమ్మాన్యుయేల్ స్పష్టత తీసుకున్న తర్వాత పవర్ అస్త్ర వినియోగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో నాగార్జున ఈ వారం ఎలిమినేషన్ రద్దయిందని అధికారికంగా ప్రకటించారు.
ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం దివ్య ఎలిమినేట్ అయ్యిందని నాగార్జున తెలిపారు. అయితే ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్ర ఉపయోగించడంతో దివ్య, సంజన ఇద్దరూ ఈ వారం సేఫ్ అయ్యారు. మొత్తానికి… సండే ఎపిసోడ్ బిగ్ ట్విస్ట్‌తో ముగిసింది. ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్ర వినియోగం షోలో కొత్త గేమ్ డైనమిక్స్‌ను తెచ్చింది. వచ్చే వారం ఎవరు నామినేట్ అవుతారు? ఎవరి గేమ్ హీట్ పెరుగుతుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.