Pallavi Prashanth | బిగ్‌బాస్ 7 ఫినాలే సందర్భంగా ఫ్యాన్స్ చేసిన వీరంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బిగ్‌బాస్ ఫ్యాన్స్ చేసిన విధ్వంసాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరిపై కేసులు పెడుతున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. పల్లవి ప్రశాంత్‌ను కూడా వదిలిపెట్టలేదు. పల్లవి ప్రశాంత్‌ను ఏ1గా, అతని తమ్ముడు మనోహర్‌ను ఏ2గా కేసు నమోదు చేశారు. దీంతో బయపడిపోయిన పల్లవి ప్రశాంత్ పరారయ్యాడని ప్రచారం జరిగింది. తన కుమారుడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని.. ఎక్కడ ఉన్నాడో తెలియదని ప్రశాంత్ తల్లిదండ్రులు చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న వార్తలపై పల్లవి ప్రశాంత్ స్పందించాడు. తానెక్కడికీ పారిపోలేదని.. ఇంటి దగ్గరే ఉన్నానని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఒక వీడియోను పోస్టు చేశాడు.
తన వల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే తనను క్షమించాలని పల్లవి ప్రశాంత్ తెలిపాడు. తానెటువంటి తప్పు చేయలేదని.. కావాలనే కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నేనెక్కడికీ వెళ్లను.. బిగ్‌బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఫోనే వాడట్లేదని స్పష్టం చేశారు. ఎవ్వరు ఏం చెప్పినా నమ్మకండని కోరారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడనే వార్త ముందుగానే బయటకు పొక్కడంతో చాలామంది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చేశారు. అదే సమయంలో అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొందరు రోడ్డుపై నానా హంగామా చేశారు. ఇతర కంటెస్టెంట్ల కార్లపై దాడికి దిగారు. ఈ క్రమంలో అమర్దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రోడ్డుపైనే కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు అల్లర్ల వెనుక పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించారు.ఈ మేరకు పల్లవి ప్రశాంత్, అతని అభిమానులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్, ఏ-2గా అతని తమ్ముడు మనోహర్, ఏ-3గా మరో స్నేహితుడి పేరును నమోదు చేశారు. తాజాగా ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశారు. విధ్వంసానికి సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా మరికొంతమంది ఆకతాయిలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని వార్తలు వచ్చాయి.