Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో 31వ రోజు ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వర్షిణి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను త్రిగుణ్‌తో పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది. మరోవైపు అపూర్వపై హౌస్మేట్స్ మధ్య చర్చ జరగడంతో పాటు, డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ నిర్వహించిన టాస్క్‌లో చరణ్, అపూర్వ జోడీ విజయం సాధించింది. వర్షిణి తన తండ్రి గురించి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న బాధను త్రిగుణ్‌తో పంచుకుంది. తాను చిన్నప్పటి నుంచి అమ్మతోనే పెరిగానని, తన తండ్రి తనకు అందుబాటులో లేకపోవడంతో ఆయన చేయి పట్టుకునే అవకాశం కూడా తనకు దక్కలేదని చెప్పింది. ఆ లోటు తనలో చాలా కాలంగా ఉందని, అది తన మనసులో అణచివేసిన భావోద్వేగంలా మారిపోయిందని తెలిపింది.
ఈ క్రమంలోనే ముకేశ్‌తో తాను ఎందుకు అంత సన్నిహితంగా ఉంటుందో కూడా వర్షిణి వివరించింది. బయట నుంచి చూసేవారికి తమ మధ్య ప్రేమ వ్యవహారం ఉందేమో అనిపించవచ్చని, కానీ తమ మధ్య అలాంటి బంధం లేదని స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ, భద్రతకు దూరంగా ఉండటం వల్ల ముకేశ్ చేయి పట్టుకున్నప్పుడు తనలోని భయం తగ్గినట్టుగా అనిపిస్తుందని చెప్పింది. ముకేశ్ తన మాటలను ఓపికగా వింటాడని, తాను ఏ విషయం చెప్పినా శ్రద్ధగా వినడంతో అతనికి దగ్గరయ్యానని వర్షిణి తెలిపింది. ముకేశ్‌తో తనకున్నది ప్రేమ కాదని, పూర్తిగా భావోద్వేగంతో కూడిన అనుబంధమని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఇదిలా ఉండగా.. హౌస్‌లో అపూర్వ గురించి దేబ్జానీ, వంశీ మధ్య చర్చ జరిగింది. దేబ్జానీ అపూర్వను ఇమిటేట్ చేస్తూ ఆమె గొడవపడే సమయంలో ఎలా ప్రవర్తిస్తుందో సరదాగా చూపించింది. దీనిపై స్పందించిన వంశీ.. ప్రతి సీజన్లోనూ హౌస్‌లో విరక్తి పుట్టించేలా ఉండే ఓ కంటెస్టెంట్ ఉంటారని, అందుకే అపూర్వ లాంటి వాళ్లు వస్తుంటారని వ్యాఖ్యానించాడు. మరోవైపు డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లను సేఫ్ జోన్‌కు తీసుకెళ్లేందుకు బిగ్‌బాస్ ప్రత్యేక టాస్క్ నిర్వహించారు. ఇందులో కంటెస్టెంట్లను జంటలుగా విభజించారు. త్రిగుణ్–అమన్, నరేష్–రామ్ ప్రసాద్, చరణ్–అపూర్వ, ఝాన్సీ–ముకేశ్, రోహిత్–షాలిని జంటలుగా ఏర్పడ్డారు.
‘స్టార్ట్ స్టార్ సూపర్ స్టార్’ పేరుతో జరిగిన ఈ టాస్క్‌లో స్టార్ గుర్తు వచ్చేలా ఇచ్చిన అమరికను పూర్తి చేయాల్సి వచ్చింది. ఇందులో చరణ్, అపూర్వ జోడీ అందరికంటే ముందుగా టాస్క్‌ను పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. త్రిగుణ్–అమన్ రెండో స్థానంలో, ఝాన్సీ–ముకేశ్ మూడో స్థానంలో, నరేష్–రామ్ ప్రసాద్ నాలుగో స్థానంలో నిలిచారు. రోహిత్–షాలిని జోడీ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. వర్షిణి తన వ్యక్తిగత జీవితంలోని బాధను బయటపెట్టడం, ముకేశ్‌తో తన అనుబంధంపై క్లారిటీ ఇవ్వడం, మరోవైపు అపూర్వ చుట్టూ హౌస్‌లో చర్చ జరగడం.. ఇలా 31వ రోజు బిగ్‌బాస్ హౌస్‌లో భావోద్వేగాలు, వివాదాలు, టాస్క్‌లతో ఆసక్తికరంగా సాగింది.