Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రెండో రోజే ఆట రసవత్తరంగా మారింది. ఇంటి సభ్యులను రెండు టీంలుగా విడగొట్టి.. ఒక్కో టీమ్‌కు నాయకులను ఎంపిక చేయడంతో పాటు, వారి సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేలా బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎవరు ఎవరితో కలుస్తున్నారు? ఎవరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంది? అనే విషయాలు బయటపడటంతో ఇంట్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెలబ్రిటీలు, సామాన్యులుగా విడిపోయిన ఇంటి సభ్యుల నుంచి ఇద్దరు నాయకులను ఎంపిక చేశారు. సెలబ్రిటీల తరఫున రాం ప్రసాద్, సామాన్యుల తరఫున రోహిత్ నాయకులుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత మిగిలిన 12 మంది సభ్యులకు ‘బ్యాగ్ టాస్క్’ ఇచ్చారు.
గార్డెన్ ఏరియాలో ఉంచిన బ్యాగ్‌లను తీసుకున్న సభ్యులు.. వాటిలో ఉన్న బ్యాడ్జ్‌లను తమకు నచ్చిన నాయకుడికి ఇవ్వాలి. ఆ బ్యాడ్జ్‌ల ఆధారంగా నాయకులు తమ సైన్యంలో సభ్యులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.ఈ టాస్క్‌లో ఎవరు ముందుగా ఎవరిని ఎంచుకుంటారు? ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? అనే అంశం ఇంట్లో ఆసక్తిని పెంచింది. టాస్క్‌లో భాగంగా ముఖేష్ గౌడ బ్యాగ్ తీసుకుని రాం ప్రసాద్‌కు ఇవ్వగా.. అందులోని బ్లూ బ్యాడ్జ్‌ను త్రిగుణ్‌కు ఇచ్చాడు రాం ప్రసాద్.మరోవైపు రోహిత్.. అమన్‌కు రెడ్ బ్యాడ్జ్ ఇచ్చి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత టెంపర్ వంశీకి, శాలినికి కూడా బ్యాడ్జ్‌లు ఇచ్చాడు. ఇక రాం ప్రసాద్ నరేష్, దేబ్జానీలను తన టీమ్‌లోకి తీసుకున్న సమయంలో ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.
ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉండాలి. నేను హౌస్‌లోకి రాగానే రామన్నా అని పిలిచింది. ఆ బాండింగ్ కోసమే ఈ బ్యాడ్జ్ ఇస్తున్నాఅంటూ దేబ్జానీకి బ్యాడ్జ్ ఇచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. టాస్క్ చివరి దశకు వచ్చేసరికి కృష్ణుడు, చైత్ర మాత్రమే మిగిలారు. అయితే ఇద్దరు నాయకులు వారిని చివరి వరకు తమ టీమ్‌లోకి తీసుకోలేదు.చివరికి రోహిత్ కృష్ణుడికి బ్యాడ్జ్ ఇస్తూ.. మిగిలింది వీళ్లిద్దరే కావడంతో, ఫిజికల్‌గా వీక్‌గా ఉన్న చైత్రను తన టీమ్‌లోకి తీసుకుంటున్నానని చెప్పాడు. అయితే రోహిత్ చెప్పిన ఈ కారణం కృష్ణుడికి నచ్చలేదు.దీనికి రాం ప్రసాద్ కూడా తనదైన రీతిలో స్పందించాడు. తనకు మరో ఆప్షన్ లేకపోవడంతో చైత్రను ఎంపిక చేసుకుని, కృష్ణుడిని తన టీమ్‌లోకి తీసుకుంటున్నట్లు చెప్పాడు.
టీంలు పూర్తిగా ఏర్పడిన తర్వాత యాంకర్ వర్షిణి.. రాం ప్రసాద్‌ను ప్రశ్నించింది. తనను ముందుగానే ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీసింది.దీనికి రాం ప్రసాద్.. రోహిత్ ఆమెను ఖచ్చితంగా తన టీమ్‌లోకి తీసుకోడని భావించానని, అందుకే ఆమెను చివరి వరకు పిక్ చేయలేదని వివరణ ఇచ్చాడు.అదే సమయంలో రోహిత్ తన టీమ్ సభ్యులకు గెలుపు కోసం ప్రేరణ కలిగించేలా మాట్లాడాడు.మనం ఓడిపోయినా పర్లేదు.. కానీ గెలవాలి అంటూ రోహిత్ చెప్పడంతో ఆర్జే చరణ్ సరదాగా కౌంటర్ ఇచ్చాడు.
ఇంటి సభ్యులు కలిసి ఒక టీమ్‌గా ఆడుతున్న నేపథ్యంలో ‘గ్రూప్ గేమ్’ అనే మాట కూడా చర్చకు వచ్చింది. ఆర్జే చరణ్‌కు ‘గ్రూప్’ అనే పదం నచ్చలేదు.
దీనిపై వర్షిణి స్పందిస్తూ.. అందరూ కలిసి గ్రూప్‌గా ఆడుతున్నప్పుడు దాన్ని గ్రూప్ గేమ్ అనకపోతే ఇంకేమని పిలవాలని ప్రశ్నించింది.అంతేకాదు.. “మీరంతా కలిసే ఉంటున్నారు.. కానీ ఝాన్సీ మీతో ఎందుకు కలవడం లేదు?” అంటూ చరణ్‌ను వర్షిణి ప్రశ్నించింది.దీనికి ఝాన్సీ సెలబ్రిటీలతోనే ఎక్కువగా స్నేహంగా ఉంటుందని చరణ్ అభిప్రాయపడ్డాడు.ఇదే సమయంలో ఝాన్సీ గేమ్‌ను కూడా ఇంటి సభ్యులు చర్చించారు. ఝాన్సీ న్యూట్రల్‌గా ఆడుతోందని, ఎవరు ఏ గేమ్ ఆడుతున్నారు? ఎవరు ఎక్కడ చేరుతున్నారు? అనే విషయాలను ఆమె గమనిస్తోందని త్రిగుణ్ అన్నాడు.అయితే ముఖేష్ గౌడ మాత్రం ‘అగ్నిపరీక్ష’ ముగిసిపోయిందని.. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి గేమ్ వారు ఆడుతున్నారని చెప్పాడు.దీనిపై వర్షిణి మాత్రం ఆసక్తికరమైన పాయింట్ తీసుకొచ్చింది. “మనం అలా అనుకునే తప్పులో కాలేస్తున్నాం. వాళ్లు చాలా యూనిటీగా ఉన్నారు” అంటూ అగ్నిపరీక్ష నుంచి వచ్చిన సభ్యుల మధ్య ఉన్న బాండింగ్‌పై వ్యాఖ్యానించింది.
ఆ తర్వాత బిగ్ బాస్ బ్లూ టీమ్ సభ్యులకు మరో టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులుగా ఉండటానికి అనర్హులుగా భావిస్తున్న ఒక్కొక్కరి పేరును చెప్పాల్సి వచ్చింది.“అగ్నిపరీక్షలో రోహిత్‌ను చూసిన తర్వాత అతనితో మంచి వైబ్ ఉంటుందని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతను తనను తాను పెద్ద తోపులా ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోంది” అని వర్షిణి చెప్పింది.అంతేకాదు.. “రావడం రావడమే నా అంతటోడు లేడు, నేనే పెద్ద అన్నట్టుగా బిల్డప్‌తో యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. గేమ్‌లో ఓడిపోయినా ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేశాడు” అంటూ రోహిత్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.