భూతద్దం భాస్కర్ నారాయణ
ఆహా: మార్చి 22
తారాగణం: శివ శంకర్, రాశి సింగ్, అరుణ్ కుమార్ తదితరులు
దర్శకత్వం: పురుషోత్తం రాజ్
OTT | థియేటర్లో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలోనూ అదే రేంజ్లో హిట్ అవుతున్నాయి. అందులోనూ డిటెక్టివ్ సినిమాలంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఇన్వెస్టిగేటివ్ సినిమాగా తెరకెక్కిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఇప్పుడు ఓటీటీలో రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నది. బాక్సాఫీస్ కలెక్షన్ల మాట ఎలా ఉన్నా… ఆహా ప్రేక్షకులను మాత్రం అలరిస్తున్నది. కథలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దు అడవిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. మృతదేహాల తలను మొండెం నుంచి వేరు చేసి అడవిలో పడేస్తుంటాడు హంతకుడు. మృతుల వేలిముద్రలు కూడా దొరక్కుండా చేతివేళ్లను కాల్చేస్తుంటాడు.
మరోవైపు హతుల గురించి ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో చనిపోయింది ఎవరో పోలీసులకు అంతుచిక్కదు. ఈ కేసులను ఛేదించడానికి ప్రైవేట్ డిటెక్టివ్ భూతద్దం భాస్కర్ (శివ శంకర్) రంగంలోకి దిగుతాడు. ఒకవైపు కేసు పరిశోధనలో ఉండగానే.. వరుసగా హత్యలు జరుగుతుంటాయి. చనిపోయిన వారంతా హిజ్రాలని తేలుతుంది. ఇంతకీ హంతకుడు ఎవరు? హిజ్రాలనే ఎందుకు టార్గెట్ చేశాడు? భూతద్దం భాస్కర్ డిటెక్టివ్ ఎందుకు అవ్వాలనుకున్నాడు? ఈ కేసును అతను పరిష్కరించాడా లేదా అన్నది మిగిలిన కథ!