Bhoomika | పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఖుషి చిత్రం ఒకటి. ఈ సినిమాని ఎన్ని సార్లు చూసిన బోరింగ్ ఫీల్ రాదు. పవన్ కళ్యాణ్, భూమిక ప్రధాన పాత్రలలో ఎస్ జె సూర్య ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. 2001లో వచ్చిన ‘ఖుషి’ సినిమా, యువతలో క్రేజ్ పెంచిన సినిమా కావడం విశేషం. ఇందులో పవన్ సరసన నటించిన భూమిక చావ్లా ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పని చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని భూమిక ఓ సందర్భంలో పంచుకుంది.
ఖుషి మూవీ షూటింగ్ సమయంలో ఒక ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఒక గుడిలో షూట్ చేస్తున్నాం. అక్కడ దీపం ఆరిపోకుండా, నేను మరియు పవన్ కళ్యాణ్ కలిసి చేతులు పెట్టే సన్నివేశం ఉంది. ఆ సమయంలో నేను మేకప్ చాలా తక్కువగా వేసుకున్నాను. అప్పట్లో నేను ఎక్కువగా మేకప్ వాడే దానిని కాదు. షాట్‌కి సిద్ధమైన తర్వాత పీసీ శ్రీరామ్ గారు నన్ను చూసి ఏంటీ మేకప్? వెళ్లి ముఖం కడుక్కొని రా! అంటూ అందరి సమక్షంలో అన్నారు. తక్కువ మేకప్ అని చెప్పినా వినకుండా, ఆయనే స్వయంగా ఫేస్ వాష్ ఇస్తూ ముఖం క్లీన్ చేసుకుని రావాలని ఆదేశించారని తెలిపింది.
ఆ సమయంలో చాలా బాధపడ్డానని చెప్పిన భూమిక, “కాస్త తక్కువ మేకప్ వేసుకున్నప్పటికీ అది ఆయనకు నచ్చలేదు అని పేర్కొంది. అయితే సినిమా చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పీసీ శ్రీరామ్ గారు నన్ను ఎంతో అందంగా చూపించారు. నన్ను చూసి నేనే ఆశ్చర్యపోయాను అంటూ ఆ సంఘటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఖుషి మూవీలో 80 శాతం సీన్లలో నేను నేచురల్ లుక్‌లోనే ఉన్నాను. కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రమే లైట్ మేకప్ వేసుకున్నాను. ఆ నేచురల్ లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది అని వెల్లడించింది భూమిక. ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలవడమే కాక, భూమికను కూడా స్టార్ హీరోయిన్ని చేసింది.