Pawan Singh | భోజ్‌పురి స్టార్ నటుడు పవన్ సింగ్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల నటి అంజలి అనుమతి లేకుండా అనుచితంగా నడుమును తాకి విమర్శల పాలైన ఈ నటుడు తాజాగా ఒక వ్యాపారిని రూ.1.57 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్నాడు. వ్యాపారవేత్త విశాల్ సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. విశాల్ సింగ్ అనే వ్యాపారవేత్త 2018లో “బాస్” అనే భోజ్‌పురి చిత్రంలో పెట్టుబడి పెట్టాడు. ఈ చిత్రంలో పెట్టుబడి పెడితే లాభాల్లో వాటా ఇస్తామని పవన్ సింగ్, అతని స్నేహితులు హామీ ఇచ్చారని విశాల్ సింగ్ ఆరోపించారు. అయితే, సినిమా విడుదలైన తర్వాత అతనికి లాభాల్లో వాటా రాలేదని.. తన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే పవన్ సింగ్ చంపుతానని బెదిరించారని విశాల్ సింగ్ పేర్కొన్నారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన విశాల్ సింగ్ పవన్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును స్వీకరించిన పోలీసులు పవన్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిపై మోసం, అలాగే బెదిరింపుల ఆరోపణల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మరోవైపు, పవన్ సింగ్ ఇటీవల ఒక వేదికపై నటి అంజలి రాఘవ నడుమును అసభ్యంగా తాకిన వీడియో కూడా వైరల్ అయింది. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, దీనిపై పవన్ సింగ్ క్షమాపణలు కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదాల నేపథ్యంలో పవన్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.