Director Sagar k.chandra | అదేంటో ఒక్కోసారి ఎంత పెద్ద విజయం వరించినా అవకాశాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు దర్శకుడు సాగర్ కే. చంద్ర. ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి విభిన్న సినిమాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాగర్. ఆ తర్వాత దాదాపు 6ఏళ్ళు గ్యాప్ తీసుకుని ఏకంగా పవన్‌తో ‘భీమ్లానాయక్’ సినిమా చేశాడు. ఇలా మూడో సినిమాకే పవన్ వంటి స్టార్ హీరోతో సినిమా చేయడంతో టాలీవుడ్లో సాగర్‌చంద్ర పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. గతేడాది ప్రథమార్థంలో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
కానీ దర్శకుడిగా సాగర్‌కు మాత్రం రావాల్సిన గుర్తింపు అంతగా రాలేదు. ఎందుకంటే ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే-మాటలు త్రివిక్రమ్ అందించాడు. దాంతో ఈ సినిమా పవన్-త్రివిక్రమ్ సినిమా అయిపోయింది. ఈ నేపథ్యంలో సినిమా ఎంత విజయం సాధించినా సాగర్‌కు మాత్రం క్రెడిట్ దక్కలేదు. దానివల్లే స్టార్ డైరెక్టర్ ట్యాగ్‌ను కూడా తెచ్చుకోలేకపోయాడు. ఈ దెబ్బతో ఏడాదైనా ఇప్పటికీ మరో సినిమా పట్టాలెక్కించలేదు. అయితే తాజాగా ఓ యంగ్ హీరోతో సాగర్ తన నాలుగో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఆ యంగ్ దర్శకుడు ఎవరా అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్. ‘అల్లుడు శ్రీను’తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు శ్రీనివాస్. ఈ క్రమంలో బాలీవుడ్లో తన లక్ ప్రదర్శించుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఛత్రపతి’ సినిమను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదల కాగానే సాగర్‌తో సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్లో ఈ సినిమా రూపొందనున్నట్లు టాక్.