అందాల నాయికలు హీరోయిన్లుగా తమ కెరీర్ చూసుకుంటూనే వీలున్నప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. తానూ ఈ జాబితాలో ఉన్నానని ముందుకొచ్చింది బాలీవుడ్ తార శ్రద్ధా కపూర్. వరుణ్ ధావన్ కొత్త సినిమా ‘బేడియా’లో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. కృతి సనన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అమర్ కౌశిక్ రూపొందిస్తున్నారు. దినేష్ విజాన్ నిర్మాత. ఈ చిత్రంలోని ‘తుంకేశ్వరి..’ పాటలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది శ్రద్ధా. ఈ చిత్ర నిర్మాణ సంస్థ గతంలో నిర్మించిన ‘స్త్రీ’ సినిమాలో లీడ్ రోల్లో నటించింది శ్రద్ధా కపూర్. ఆ పరిచయంతోనే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆమె అంగీకరించదట. ఈ పాటలో వరుణ్ ధావన్, కృతి సనన్‌లతో పాటు ఆడిపాడింది శ్రద్ధ. ఈ పాట ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. భాస్కర్ అనే యువకుడిని తోడేలు కరిచిన తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి. అతనే ఒక తోడేలులా ఎందుకు మారిపోయాడు అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధా లవ్ రంజన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నది.