Bhanu Sri | బిగ్ బాస్ భాను శ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మి రూ.20 లక్షలు కోల్పోయిన ఘటన తన జీవితంలో అత్యంత బాధాకరమైన అనుభవాల్లో ఒకటని భాను శ్రీ వెల్లడించారు. భాను శ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తికి ఆమె రూ.20 లక్షలను నగదు రూపంలో ఇచ్చారు. ఆ వ్యక్తి మొదట దాదాపు రెండేళ్ల పాటు ప్రతి నెలా 3 శాతం వడ్డీని ఆమె బ్యాంకు ఖాతాలో క్రమం తప్పకుండా జమ చేశారట. వడ్డీ డబ్బులు ఎలాంటి ఆలస్యం లేకుండా రావడంతో భాను శ్రీకి ఆ వ్యక్తిపై నమ్మకం మరింత పెరిగిందని తెలిపారు. దీంతో తన పెట్టుబడి కూడా సురక్షితంగానే ఉందని భావించినట్లు చెప్పారు.
కానీ రెండేళ్లు పూర్తయ్యాక అసలు డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగిన సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని భాను శ్రీ చెప్పుకొచ్చారు. తన రూ.20 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు.. ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వలేమని చెప్పినట్లు భాను శ్రీ తెలిపారు. ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించగా.. మాకు ఇవ్వలేము అంటే ఇవ్వలేము అంతే అన్నట్టుగా సమాధానం ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తాను ఇచ్చిన డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టామని, అందులో ఆ మొత్తం పోయిందని వారు చెప్పినట్లు భాను శ్రీ వివరించారు. ఈ వ్యవహారంలో మరో పెద్ద సమస్య ఏమిటంటే.. భాను శ్రీ ఆ రూ.20 లక్షలను నగదు రూపంలో ఇవ్వడం. దీంతో తాను డబ్బులు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారం లేదంటూ అవతలి వ్యక్తులు వాదించారని ఆమె తెలిపారు.
నువ్వు ఎక్కడ ఇచ్చావు మాకు డబ్బులు? మాకు ఇవ్వలేదు నువ్వు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించు అంటూ వారు తిరస్కరించారని భాను శ్రీ తీవ్ర ఆవేదనతో గుర్తుచేసుకున్నారు. డబ్బులు ఇచ్చినప్పుడు ఎలాంటి పత్రాలు లేదా ఆధారాలు తీసుకోకపోవడం తనకు పెద్ద సమస్యగా మారిందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. తనకు సొంతంగా ఓ ఇల్లు కొనుక్కోవాలనే ఉద్దేశంతోనే ఆ సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నానని భాను శ్రీ తెలిపారు. అప్పట్లో సుమారు రూ.50 లక్షలకు ఫ్లాట్ దొరుకుతుందని, అందులో రూ.20 లక్షలు ముందుగా చెల్లించి.. మిగిలిన రూ.30 లక్షలను ఈఎంఐల రూపంలో చెల్లించాలని భావించినట్లు చెప్పారు. అందుకోసం తన వద్ద ఉన్న సుమారు రూ.12 లక్షలతో పాటు, తన తల్లికి చెందిన చిన్న భూమిని కూడా అమ్మి మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకున్నట్లు ఆమె వెల్లడించారు.
ఊర్లో ల్యాండ్ ఏం చేస్తది.. ఇల్లు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అని అప్పట్లో భావించి ఆ నిర్ణయం తీసుకున్నానని భాను శ్రీ చెప్పుకొచ్చారు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు అవతలి వ్యక్తులు పోలీసులను ఆశ్రయించినా తమకు భయం లేదన్నట్టుగా మాట్లాడారని భాను శ్రీ తెలిపారు. “మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి.. పోలీస్ కేస్ పెట్టుకుంటే పెట్టుకోండి.. మాకేం సంబంధం లేదు” అని చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన తనను మానసికంగానే కాకుండా ఆర్థికంగానూ తీవ్రంగా దెబ్బతీసిందని భాను శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.